క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి అంత అక్కసు ఎందుకని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ అజహరుద్దీన్‌పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అజహరుద్దీన్‌పై కేసులు ఉన్నాయని, దేశ ద్రోహి అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. ఎక్కడ కేసులు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్రికెట్ మాజీ కెప్టెన్‌గా ప్రఖ్యాతి చెందిన, ఎంపీగా సేవలందించిన అజర్ గురించి కేంద్ర మంత్రికి తెలియకపోవడం బాధాకరమని అన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని తమ పార్టీ అధిష్టానం మూడు నెలల ముందే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మైనారిటీ నాయకున్ని అవమానించడం భావ్యం కాదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.