ప్రపంచంలో మంచినీటి కొరత నానాటికీ తీవ్రమవుతున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి లభ్యతను పెంచడం ఎలా అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలు, విధానకర్తల ముందున్న ప్రధాన సమస్య. 95 శాతం ఉన్న ఉప్పునీటి సముద్ర జలాలను మంచినీటిగా మార్చే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మంచినీరు, ఆహార కొరతను తీర్చవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే జలాలతో 97.43 శాతం ఉప్పునీరు కాగా, మంచినీటి లభ్యత కేవలం 2.57 శాతం మాత్రమేనని గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఈ స్వచ్ఛజలాలలో నదుల ద్వా రా లభించేది కేవలం 0.0002 శాతం మాత్రమే. ఈ పరిమిత నీటితోనే విశ్వవ్యాప్తంగా మానవులు, జంతువుల ఆకలిదప్పులు, పంటల సాగు అవసరాలు తీర్చవలసి వస్తోంది. అయితే ప్రస్తుతం 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 1000 కోట్లు దాటుతుంది. పరిమితంగా ఉన్న మంచినీటి లభ్యతను పెంచకపోతే భవిష్యత్తులో జీవావళి తీవ్ర నీటికొరతను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణంలో వస్తున్న పెనుమార్పులవల్ల దుర్భిక్షాలు, కరవులు ఏర్పడి నీటిలభ్యత తగ్గడం, దశాబ్దాల క్రితం నిర్మించిన భారీ జలాశయాలు ఒండ్రు మట్టి చేరడంవల్ల పూడికపెరిగి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు చేరకపోవడం తెలిసిందే. భారీవర్షాలు, వరదలు వచ్చినపుడు నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి వల్ల ఏటా వేల టిఎంసిలు వృథాగా ఉప్పు సముద్రాలలో కలసి పోవడం, అయినా రాష్ట్రాల మధ్య జలజగడాలు ఎడతెగకుండా కొనసాగడం, ఒక ప్రధాన ప్రాచీన పార్టీ నేతలు వాస్తవాలను గమనించకుండా 90% వాటా నీరు తమకే కావాలని కోరుతూ జాతీయ సమైక్యతకు చేటు తెస్తూ ఉండటం చూస్తున్నాం. నీటి సంక్షోభం ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ మంచినీటి వనరుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమంత ఆశాజనకంగా లేవు. రానున్న కాలంలో ఆహారం, మంచినీటి అవసరాలు మరింత పెరుగుతాయి. నీటికొరత ఉన్న ప్రాంతాలలో సేద్యానికి, మంచినీటికోసం అధికాధికంగా తోడటం వల్ల పెక్కు చోట్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి.
లభ్యమయ్యే ఉపరితల నదీ జలాల కోసం వివిధ ప్రాంతాల మధ్య ఎడతెగని వివాదాలు, వైషమ్యాలను పెంచుతున్నాయి. ప్రపంచ జనాభాలో ఇప్పటికే సగం మంది నీటికొరతను ఎదుర్కొంటున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. భారత్‌లో 60 కోట్లమంది (జనాభాలో 45%) నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విధాన నిర్ణాయక మండలి నీతిఆయోగ్ వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో నీటి అవసరాలు రెండింతలు పెరగనుండటం, మరోవైపు జలాశయాలలో పూడికపెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీటికి కటకట ఏర్పడింది. ఉప్పునీటిలో లీటరుకు టిడిఎస్ స్థాయిలు వెయ్యి మి.గ్రా కంటే ఎక్కువగా ఉండటం వల్ల అవి తాగడానికి, సేద్యానికి, పారిశ్రామిక వినియోగానికి పనికి రావనే అభిప్రాయం ఉంది. అందువల్ల అన్ని అవసరాలకు మంచినీటినే వాడటం వల్ల గిరాకీ కంటే నీటి లభ్యత తక్కువగా ఉండటంవల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి.
నీటిసంక్షోభం తీవ్రమవుతున్నా నీటి పొదుపు, పరిమితంగా ఉన్న మంచినీటి పునఃపంపిణీ గురించే మాట్లాడుతున్నారే గానీ ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోవడం లేదు. ఉప్పునీటి నుండి క్షారాన్ని యోలగించి మంచినీటిగా మార్చడం, సేద్యానికి ఎలా వాడాలి అనే దానిపైనే పరిశోధనలు సాగుతున్నాయి. వాస్తవ మేమంటే ప్రపంచ నీటిలో 98% ఉప్పునీరే. అందువల్ల అత్యాధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి పెరుగుతున్న మానవాళి అవసరాలు తీర్చే రీతిలో ప్రపంచ దేశాలు క్షార జలాలను ఎలా మార్చాలి అనే ప్రధానాంశంగా పరిశోధనలు సాగిస్తే అది ఎంతో మేలు. రక్షణ బడ్జెట్లు, ఆయుధ పోటీలు పెంచి, లాభాలు దండుకుంటున్న సంపన్న దేశాలు మానవాళికి అత్యవసరమైన మంచినీటిపై దృష్టి సారించకపోవడం తగదు. భారీ జలాశయాలలో నీటినిల్వ, నీటి ఆదాకు మాత్రమే పరిష్కారాలను పరిమితం చేశారు. ఉప్పునీటిని శుద్ధి చేసి ఆహారోత్పత్తికి, మంచినీటి సరఫరా మెరుగుకు నిర్దిష్ట ప్రయత్నాలు లేవు. ఉప్పునీరు వాడకానికి పనికి రావనే నమ్మకాలు బలంగా ఉన్నా యుగయుగాలుగా మానవాళి ఆక్షార జలాలను వాడటం తెలిసిందే. 1900 పోషకాలతో లభించే సముద్ర ఉత్పత్తులు మానవ ఆహారంలో ప్రధాన భాగం.
మన సాగరాలు, మహాసముద్రాలు ఎన్నో ఖాద్య యోగ్యమైన మొక్కలకు నెలవులు. వివిధ వర్ణాల, రకాల నాచు, ఆలగే (aalge), గవ్వలరకాలు, తూర్పు, ఆగ్నేయాసియా, పసిఫిక్ తీరదేశాల్లో ఎక్కువగా వాడే సముద్ర ద్రాక్ష తదితర మొక్కలు ఆహారంగా ఎంతో ఉపయోగమవుతున్నాయి. ఆర్థిక దృక్కోణం నుండి చూస్తే మంచినీటితో సాగయ్యే ఎన్నో పంటలను కొన్ని ప్రక్రియలతో ఉప్పునీటితో సాగు చేసే వీలుం ఉంటుందని అంటున్నారు. క్షారాన్నీ తట్టుకుని పెరిగే తుమ్మ, జమ్మి తదితర సముద్ర మాన్లు మేలి కలపగా పనికొస్తాయని చెబుతున్నారు. హాలో ఫైట్స్ ప్రత్యామ్నాయంగా వస్తున్న పంటలు వంట నూనెల ఉత్పత్తికి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా అక్కరకొస్తాయంటున్నారు. ఉప్పునీటితో పెరిగే పూవులు, ఉద్యాన పంటలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడతాయని నిపుణుల అభిప్రాయం.
క్షారాజలాన్ని మెరుగైనరీతిలో వాడితే పురోభివృద్ధి సాధ్యం కాగలదని భావన బలంగా ఉంది. ప్రపంచ జనాభాలో 38% మంది సముద్ర తీరానికి 100 కి.మీ దూరంలోనే నివసిస్తున్నందున (అంటార్కిటికా మినహా) తీరప్రాంతం 24 లక్షల కి.మీ మీరు ఉంటుంది. వాతావరణ పెనుమార్పు వల్ల సముద్రాలు చొచ్చుకువచ్చి తీర ప్రాంతాలను కలిపేసుకుంటున్నాయి. భారత ద్వీపకల్పం 11 వేల కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 972 కి.మీ సాగరతీరాన్ని కలిగి, లక్షలాది మంది కడలి పుత్రులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. వారికి మరింత మెరు గయిన జీవనోపాధుల కల్పనకు సాగరతీరాన్ని, జలాలను ఆహారోత్పత్తి, పంటల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి ఎలాంటి చర్యలు అవసరమో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా కేంద్రాల శీతలీకరణకు రోజుకు కోటి 90 లక్షల లీటర్ల నీరు అవసరమని, సాగర జలాలను శుద్ధి చేసి వాడతారని చెబుతున్నారు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సిఎం చంద్రబాబు, ఐటి మంత్రి లోకేష్ చెబుతున్నారు. సాగర జలాలను మెరుగైన రీతిలో వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి మోడీ ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలి.
– పతకమూరు దామోదర్ ప్రసాద్
94409 90381