డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఓ వృద్ధుడి నుంచి సైబర్ నేరస్థులు రూ.51 లక్షలు కొట్టేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వృద్ధుడు (78) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వృద్ధుడికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన సైబర్ నేరస్థులు తాము ముంబాయి క్రైం బ్రాంచ్ పోలీసులమని చెప్పారు. మీ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారంటూ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయనకు వాట్సప్ కాల్ చేశారు. సీబీఐ పేరుతో ఉన్న నోటీసులు చూపి బెదిరించారు. బాధితుడి పేరుతో ఇతరులు సిమ్ కార్డులు తీసుకుని బాంబు పేలుళ్లకు వాడారని బెదిరించారు.
మనీలాండరింగ్ లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పి వృద్ధుడిని సైబర్ నేరస్థులు వీడియో కాల్‌లో 24 గంటలపాటు నిర్బంధించారు. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా వృద్ధుడి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నారు. కేసు నుంచి తప్పించాలంటే ఖాతాలోని 95 శాతం నగదు పంపాలన్నారు. దర్యాప్తు అనంతరం తిరిగి ఇస్తామని చెప్పారు. కేసు భయంతో బాధితుడు రూ.51 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.