మన తెలంగాణ/హన్మకొండ: వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని అధైర్య పడవద్దని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జలమయమైన ఎన్‌ఎన్ నగర్, బిఆర్ నగర్ ప్రాంతాల్లో మంత్రి లోక్ సభ సభ్యురాలు డా.కడియం కావ్య, కలెక్టర్ డా.సత్య శారదతో కలిసి క్షేత్ర వరద ప్రాంతాలను సందర్శించి, బాధితులకు దైర్యం కలిగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా భారీ వర్షాలు కురిసాయని, వృద్ధులు ఆపరేషన్ మొదటి అంతస్తులో సుమారు 400 మంది వరకు ఉన్నారని, ఎస్‌డిఆర్‌ఎఫ్, డిఆర్‌ఎఫ్ ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు.
గత 5 సం.ల నుండి ముంపు పరిస్థితి తలెత్తుతున్నదని, నగర పరిధిలో లోతట్టు ప్రాంతాలు ఉండడం, కొన్ని ప్రాంతాలు కబ్జాకు గురవ్వడం, సరైన వెడల్పుతో నాలాలు ఉండకపోవడం ఇందుకు కారణమని ఇకముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, వారి ఆదేశం మేరకు ముందుకు వెళతామని మంత్రి తెలిపారు. వరద ప్రభావం దృష్ట్యా గత రాత్రి నుండి జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి మన వద్ద అందుబాటులో ఉన్న డిఆర్‌ఎఫ్ బృందాలకు తోడు ఎన్‌డి ఆర్‌ఎఫ్ బృందాలను కూడా పిలిపించడం జరిగిందని ఆయా డివిజన్‌లకు చెందిన కార్పొరేటర్లు కూడా రాత్రి నుండి వారి డివిజన్‌లలో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని కాలనీ లలోని వరద ప్రాంతాల్లో చిక్కున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆవాసం అందిస్తున్నామని అన్నారు.
వరద వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని, వరద వల్ల నిరాశ్రయులైన వారికి తాత్కాలికంగా వరంగల్ ప్రాంతంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు సుమారు 700 మందిని తరలించినట్లు, వరద నీటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేని వారికి డ్రోన్ ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సారి వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లను అందించి ఆ ప్రాంతాలను ఖాళీ చేయించేలా చూస్తామని, ప్రస్తుత పరిస్థితి నేపధ్యంలో రెండు రోజులు సెలవులు ప్రకటించామని, ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఉందని, వరంగల్‌లో వరద పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని పునరావస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులకు పౌష్టికాహారం మంచినీటితో పాటు దుప్పట్లను కూడా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా పరిధికి లో సగటున 25 సెం.మీ వర్షపాతం నమోదు కావడం జరిగిందని పర్వతగిరి కల్లెడ ప్రాంతాలలో 37 సెం.మీ వర్షపాతం నమోదైందని నెక్కొండలో 33 సెం.మీ వర్షం కురిసిందని పర్వతగిరి, నెక్కొండ,వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అత్యధికం గా వర్షం కురిసిందని, పర్వత గిరి లో కొన్ని చెరువుకు లకు గండ్లు పడ్డాయని విద్యుత్ సరఫరా లో అంతరాయాలు ఏర్పడ్డాయని, ఎన్ పి డి సి ఎల్ నుండి సిఎండి పర్యవేక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాయపర్తి మండలం లో కట్ట తెగడం వల్ల సుమారు 50 ఇండ్లు ప్రభావితం అయ్యాయని, పంట పొలాల్లోకి నీరు చేరడం జరిగిందని వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని తెలిపారు.
వర్షం నిలిచిపోయినప్పటికి నగరంలో కొన్ని కాలనీలు ఇంకా నీటి లోనే ఉన్నాయని ముంపు ను అరికట్టగలిగితే రాబోయే 12 నుండి 16 గం.లలో నీరు పూర్తి గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని ఎస్ ఆర్ నగర్‌లో వృద్ధుడు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు వృద్ధాప్య కారణంతో మృతి చెందినట్లు తెలిసిందని, సమగ్ర సమాచారం అందాల్సి ఉందని తెలిపారు. వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణి కార్పొరేటర్ పల్లం పద్మ రవి, డిఎఓ అనురాధ, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, సంబంధిత శాఖల అధికారులు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.