మన తెలంగాణ/యాదగిరిగుట్ట: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విద్యుత్ ఈఈ ఊడెపు రామారావును జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రామారావు ప్రస్తుతం దేవాదాయశాఖలో విద్యుత్ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఓ కాంట్రాక్టర్ యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ మిషనరీని మూడు నెలల క్రితం టెండర్ ద్వారా సప్లై చేశాడు. దీనికి సంబంధించి రూ.11.90 లక్షల బిల్లు అయిందని, బిల్లు మంజూరు చేయడానికి బిల్లులో 20 శాతం లంచాన్ని రామారావు డిమాండ్ చేశాడని తెలిపారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేక నల్గొండ ఏసీబీ అధికారులను బాధితుడు సంప్రదించాడని, పక్కాగా నిఘా పెట్టి రామారావును పట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రామారావు మేడారం జాతర ఇంచార్జ్ ఎస్‌ఈగా వ్యవహరిస్తున్నాడని, బుధవారం మేడారం నుంచి వస్తుండగా బోడుప్పల్‌లో కాంట్రాక్టర్‌ను కలవమని చెప్పాడని తెలిపారు. కాంట్రాక్టర్‌ను కలిసిన రామారావు అతని దగ్గర నుంచి రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా రామారావును పట్టుకున్నట్లు తెలిపారు. రామారావు దగ్గర నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని, నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ కొండపైన రామారావు కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించామని, అతనికి సంబంధించిన ఇళ్లు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయని తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి వివరాలు అందజేస్తామని తెలిపారు.