మొంథా తుఫాన్ తో ఏపీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సిఎం చంద్రబాబు వివరించారు. వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగింది. ఇక హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్లు నష్టం, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగింది. ఇక ఆక్వారంగంలో రూ.1,270 కోట్లు.. మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు నష్టం, హౌసింగ్‌లో రూ.5.53 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. అయితే అదృష్టవశాత్తు తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ 120 వరకు పశువులు మృత్యువాత పడ్డాయని తెలిపారు. అయితే తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంతోనే చాలా వరకు నష్టాన్ని నివారించగలినట్టు ఆయన తెలిపారు.
తుపాను కారణంగా మారుతున్న పరిణామాలను అంచనా వేసి వాటికి తగ్గట్లుగా నిర్ణ యాలు తీసుకున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించడానికి గతంలో 10 గంటల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరించగలిగామని ఆయన తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేశారని, ఎలా ప్రాణ నష్టం లేకుండా తుఫాన్‌ను ఎదుర్కొవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నా కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించారని, గతంలో చెట్లు కూలితే తొలగించేందుకు వారం పట్టేదని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరని, కానీ ముందస్తు చర్యల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించవచ్చుని సిఎం చంద్రబాబు వెల్లడించారు.
హుద్‌హుద్ తుఫాన్‌తో విశాఖపట్నం అతలాకుతలం అయ్యింది. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దాం. తరువాత వచ్చిన తిత్లీ తుఫాన్ సమయంలోనూ సమర్థంగా పనిచేశాం. బుడమేరు వరదను ఎదుర్కొన్నాం. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తున్నాం. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధా రంగా తుఫాన్ పరిస్థితులను అంచనా వేశాం. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివా లయం వరకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అని సీఎం చంద్రబాబు గురువారం చెప్పారు. ప్రతి ఒక్కర్నీ ఆదుకుంటామని స్పష్టం చేశారు.