మనతెలంగాణ/హైదరాబాద్: అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బిజెపి కుట్రలు చే స్తోందని, అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కా లం కెప్టెన్‌గా వ్యవహారించారని, క్రికెట్‌తో దేశానికి ఎంతో సేవ చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీ నేత అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీ సుకోవడంతో ఆ రెండు పార్టీలు కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాయని ఆయన విమర్శించారు. దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో అజారుద్దీన్ ఒకరని, అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీ డాకారుడికి మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తుంటే బి జెపి అడ్డుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. అజారుద్దీన్‌పైన బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి కుట్ర చే స్తున్నాయని, బిజెపి, బిఆర్‌ఎస్‌లు తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సహకారంతోనే బిజెపి రాష్టంలో 8 సీట్లు గెలుచుకుందని ఆయన అన్నారు.
గవర్నర్‌పై బిజెపి ఒత్తిడి
జూబ్లీహిల్స్‌లో తమకు గెలిచే అవకాశం లేదని బిజెపి కి తెలుసనీ అందుకే బిఆర్‌ఎస్‌కు లాభం చేయడం కోసం ఆలస్యంగా బలహీనమైన అభ్యర్థిని బిజెపి ప్రకటించిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలు ఎవరూ బిజెపికి ఓటు వేయరని, జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్‌కు లాభం కలిగించడం కోసమే అజారుద్దీన్‌ను మంత్రి కాకుండా బిజెపి అడ్డుకుంటోందన్నారు. అ జారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌పైన బిజెపి ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. గతంలో రాజస్థాన్‌లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రి వర్గంలోకి తీసుకుందని, గంగానగర్ జిల్లా కరణ్‌పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థిగా ఉన్న సురేంద్ర పా ల్ సింగ్‌ను డిసెంబర్ 30న రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుందని, ఆయన ఉప ఎన్నిక అభ్యర్థి అని, మంత్రివర్గంలోకి బిజెపి తీసుకుందన్నారు. ఉపఎన్నికకు 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బిజెపి నాయకులు అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే ఉందని, ప్రమాణ స్వీకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బయట జరుగుతుందని భట్టి పేర్కొన్నారు.
రాజస్థాన్‌లో మీరెలా చేశారు? : పిసిసి చీఫ్
మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని పిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలనే లోపాయికారీ ఒప్పందంలో భాగంగా బిజెపి రాజకీయాలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మ క్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. క్రీడాకారుడిగా, రాజకీయ నేతగా అజారుద్దీన్ ప్రజలకు సేవలదించారని అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించామని ఆయన తెలిపారు. ఇప్పుడు మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బిజెపి అడ్డుకుంటుందని, మైనార్టీని మంత్రిని చేస్తున్నారన్న అక్కసుతో రాజకీయం చేస్తోందన్నారు. బిజెపి పాలిత రాజస్థాన్‌లో 20 రోజుల్లో ఎన్నికలు ఉండగా సురేంద్ర పాల్‌ను మంత్రిని ఎలా చేశారని, ప్రశ్నించారు. మంత్రిని చేసినా సురేంద్ర పాల్ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.
మైనార్టీలపై విషం : ఎంపి చామల
బిజెపి, బిఆర్‌ఎస్‌లు మైనార్టీలపై విషం కక్కుతున్నాయని ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించా రు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పార్టీలు అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుం డా అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ఆయన అన్నారు. మైనార్టీలు అంటే ఎందుకు అంత కడుపుమంట అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండవద్దా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే మతాల మధ్య చిచ్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం కల్ల అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తాము ఓడిపోతే ప్రభుత్వం పడిపోవాలని కెటిఆర్ ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెటిఆర్ మాటలతో కుట్ర, కుతంత్రం అంతా బయటపడిందన్నారు.