1970వ దశకంలో మార్పు కోసం లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దేశంలోని యువతలో ఓ నూతన భావావేశం రగల్చడంతో జాతీయ రాజకీయాలే పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ క్రమంగా కుంచించుకు పోతూ రావడమే కాకుండా, మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలోనే కాకుండా అనేక పెద్ద రాష్ట్రాలలో కూడా ఏర్పడుతూ వచ్చింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో నూతన నాయకత్వంను కూడా బీహార్‌లో ప్రారంభమైన యువత ఉద్యమం కారణమైంది. అయితే, అప్పటి నుండి బీహార్ రాజకీయాలు మాత్రం, ముఖ్యంగా గత 35 ఏళ్లుగా కేవలం ఇద్దరు నాయకుల చుట్టూ పరిమితం అవుతూ వస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లలో ఎవ్వరో ఒకరు లేకుండా అక్కడ ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా 20 ఏళ్లుగా ఎన్నికల్లో ఎవ్వరు గెలుపొందినా ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం నితీశ్ అన్న విధంగా బీహార్ రాజకీయాలు మారుతూ వచ్చాయి.
ఇప్పుడు మొదటిసారిగా బీహార్ రాజకీయ మార్పు వైపు ప్రయాణిస్తున్నట్లు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి వెల్లడిస్తున్నది. లాలూ ప్రసాద్ ఇప్పటికే ఎన్నికల రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక నితీశ్ కుమార్‌కు సైతం దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఆయనలో భరోసా కనిపించడం లేదు. ‘జంగిల్ రాజ్’ గా ముద్రపడిన లాలూ ప్రసాద్ కుటుంబం నుండి బీహార్‌కు విముక్తి కలిగిస్తాననే నినాదంతో 2005 లో అధికారంలోకి వచ్చిన ఆయన శాంతిభద్రతలు, మహిళలకు రక్షణ, నేరస్థులను కట్టడిచేయడం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం వంటి సదుపాయాలు కల్పించడంలో పేరొందారు. బహుశా దేశం మొత్తం మీద మహిళా ఓటర్ల మద్దతుతో సుదీర్ఘకాలం రాజకీయాలలో నెట్టుకు వచ్చిన నేత ఆయనే అని చెప్పవచ్చు. 2020 బీహార్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్‌డిఎ కేవలం .03% ఓట్ల తేడాతో మహాఘట్‌బంధన్‌ను ఓడించింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు సైతం ఎన్‌డిఎకు సంతృప్తికరంగా లేవు. అందుకనే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ కారణంతోనే గతంలో మాదిరిగా నితీశ్ కుమార్‌ను పక్కకు నెట్టే సాహసం బిజెపి చేయలేకపోతుంది. గతంలో ఎల్‌కె అద్వానీ హయాంలో రామ్ విలాస్ పాశ్వాన్‌ను, మోడీ హయాంలో చిరాగ్ పాశ్వాన్‌ను ప్రయోగించి నితీశ్‌ను కట్టడి చేసే విఫల ప్రయత్నం చేశారు.
మొదటిసారిగా బీహార్ లో ఆధిపత్యం కోసం యువ నాయకత్వం పోటీపడుతున్నది. తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్, ముఖేష్ సహాని లేదా ప్రశాంత్ కిషోర్ వంటి వారు బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తేజస్వి యాదవ్‌ను ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవంక, ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి ప్రకటించారు. బీహార్ రాజకీయాలలో తమకంటూ ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేని బిజెపి చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహిస్తున్నది. ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచే ప్రయత్నం చేశారు. అతని బలానికి మించి 29 సీట్లు అతని పార్టీకి కేటాయించింది. ఇక మొన్నటి వరకు ఎన్నికల వ్యూహకర్తగా పలు పార్టీలకు సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ తానే స్వయంగా ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. రెండేళ్లపాటు పాదయాత్ర ద్వారా ప్రజలలో బలమైన ముద్ర వేయించుకొనే ప్రయత్నం చేశారు. తన పార్టీ గెలిస్తే 150 సీట్లు, లేకపోతే 10 లోపు సీట్లు మాత్రమే పొందుతుందంటూ ‘గాలివాటం’పైన ఆధారపడుతున్నట్లు చెప్పకనే చెప్పారు.
ఒక విధంగా ఎన్నికలకు రెండు నెలల ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘ఓటరు అధికార్ యాత్ర’కు విశేషమైన స్పందన లభించింది. నితీశ్ కుమార్ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సంకేతాలు లభించాయి. కాంగ్రెస్ తన ఇండియా కూటమి భాగస్వాములతో కలిసి మద్దతును ఏకీకృతం చేయాలని లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రలో తేజస్వి యాదవ్, అఖిలేశ్ యాదవ్, ఎంకె స్టాలిన్ లతో సహా కూటమికి చెందిన అగ్ర నాయకులందరూ పాల్గొన్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఆ తర్వాత రెండు నెలలపాటు రాహుల్ గాంధీ బీహార్ వైపు చూడలేదు. మరోవంక, సీట్ల సర్దుబాటులో ప్రతిపక్ష కూటమి చతికలపడింది. అధికారికంగా సీట్ల సర్దుబాట్ల గురించి ప్రకటించలేకపోయారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించడం ద్వారా ఎన్‌డిఎ కూటమిని ఆత్మరక్షణలో పడవేశారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్ కుమార్ ను ఎన్నికల అనంతరం వదిలివేసి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు వైపు బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికలకు నితీశ్ కుమార్ నేతృత్వంలో వెడుతున్నామని చెబుతూనే ఎన్నికల అనంతరం ఎన్‌డిఎ ఎంఎల్‌ఎలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్ష కూటమి ప్రకటించగానే ఆత్మరక్షణలో పడిన బిజెపి సైతం నితీశ్‌ను కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పక తప్పలేదు. ఆ మరుసటి రోజే బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం బిజెపి శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. తమ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలనే పట్టుదల వారిలో ఉంది. అదే విధంగా జెడియు శ్రేణులలో సైతం బిజెపి పట్ల సానుకూలత కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల మధ్య ఓట్ల మార్పిడి ఏమేరకు సవ్యంగా కొనసాగుతుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా బీహార్‌లో కులాల ప్రాతిపదికనే పార్టీల బలాలు ఆధారపడి ఉన్నాయి. 57 శాతం మంది పార్టీ, అభ్యర్థ్డిని కాకుండా కులాన్ని చూసి ఓటు వేస్తారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ముఖేష్ సహానిని ఉపముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా బాగా వెనుకబడిన వర్గాలలో బిజెపి మద్దతుకు గండికొట్టే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నితీశ్ పాలనలో కొంతకాలంగా శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారడం, అభ్యర్థుల ఎంపిక రెండు ప్రధాన కూటమిలలో సైతం గందరగోళాలకు దారితీయడం, బిజెపి ప్రచారం చేస్తున్న ‘జంగిల్ రాజ్’ (లాలూ కుటుంబం పాలన) గురించి ఏమాత్రం తెలియని ఓ కొత్త తరం ఓటర్ల ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారడం వంటి పరిణామాలు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నాయి. వాస్తవానికి బీహార్ లో పట్టు సంపాదించుకోవడం కోసం ప్రధాని మోడీ 2014 నుండే విశేషంగా కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులను చేపట్టారు. అయినప్పటికీ బలమైన నాయకత్వం బిజెపికి లోపించడంతో బీహార్ లో గట్టి పట్టు సంపాదించుకోలేకపోతుంది. నితీశ్ లేకుండా బిజెపిని బలోపేతం చేయడంకోసం ప్రయత్నించారు. అయితే, అటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు నితీశ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ ఎటువంటి ప్రభావం చూపుతారని ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. దేశంలో ఎన్నికల గందరగోళాన్ని మొదట అర్థం చేసుకున్న కొద్దిమందిలో కిషోర్ కూడా ఉన్నారు. ఇప్పుడు నాయకుడిగా కూడా, అతను చాలా తక్కువ సమయంలోనే పార్టీని నిర్మించాడు. ఎంతగా అంటే అతను ఇప్పుడు 243 నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాడు. అయితే, జన్ సురాజ్ అభ్యర్థులలో ముగ్గురిని ఉపసంహరించుకోవాలని బిజెపి బలవంతం చేసిందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి కండలవీరులను ఉపయోగించుకునేవారు. తర్వాత, చాలా మంది కండలవీరులు తామే రాజకీయ నాయకులుగా మారారు. అదే విధంగా, రాజకీయ నాయకులకు నిధులు సమకూర్చే కొంతమంది వ్యాపారవేత్తలు కూడా విధానాలను నేరుగా ప్రభావితం చేయడానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యూహకర్త ఎందుకు రాజకీయ నాయకుడిగా మారలేరు? అనుకుంటూ ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.
ఒక దశలో బీహార్‌లో పికె కింగ్ మేకర్ కాబోతున్నారని చాలామంది భావించారు. 8 నుండి 10 శాతం ఓట్లతో ఆయన మద్దతు లేకుండా ఎన్నికల అనంతరం ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చని కూడా అంచనా వేశారు. అయితే, ఎప్పుడైతే తాను సొంతంగా ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని ప్రకటించారో అప్పటి నుండి ఆయన ప్రాధాన్యత తగ్గుతున్నట్లు సంకేతాలు వెల్లడి అవుతున్నాయి. ఆయనకు లభించే ఓట్లు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, ఎన్నికల వ్యూహకర్తగా మీడియాలో సంచలనాలకు పేరొందిన ప్రశాంత్ కిషోర్ గురించి బీహార్‌లో సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే మొదట్లో నరేంద్ర మోడీ, తర్వాత ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంకె స్టాలిన్ వంటి విభిన్న నేతలకు ఎన్నికల ప్రచార వ్యూహాలు జరిపించారు. రాజకీయ ప్రత్యర్థులపై బురదచల్లడం ఆయన మార్క్ ప్రచారంగా పేరొందింది. ప్రజాక్షేత్రంలో ఏనాడూ విశ్వసనీయ నేతగా గుర్తింపు పొందలేకపోవడమే కాకుండా ఆయన పనిచేసిన నాయకుల వైరుధ్యం గమనిస్తే ఆయనకు సైద్ధాంతిక నిబద్ధత కూడా లేదని స్పష్టం అవుతుంది.
మరోవంక, వివాదాస్పదంగా మారిన ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) రాజకీయంగా బిజెపికి ఏమాత్రం ప్రయోజనం కలిగిస్తుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. 65 లక్షల మంది ఓటర్లను తొలగించగా, వారిలో తమ మద్దతు దారులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ స్థానిక నేతలే వాపోతున్నారు. ఒక విధంగా ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్ కు సవాల్ అని చెప్పవచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా మెజారిటీ తీసుకు రావడంలో విఫలం చెందారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సాధించిన విజయాలలో సైతం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పట్టుదల కారణంగా ఎక్కవు లాగా భావిస్తున్నారు. బీహార్ లో బిజెపిని గెలిపించలేకపోతే వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.
– చలసాని నరేంద్ర, 98495 69050