హైదరాబాద్: పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు ఇవ్వాలి అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించాలని అన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. సిఎంతో సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వివిధ జిల్లాలో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కలెక్టర్లు వివరించారు. పంట నష్టం, రహదారుల నష్టంపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పంటనష్టం, రోడ్ల నష్టంపై సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులకు రేవంత్ ఆదేశం ఇచ్చారు.
కేంద్రం నుంచి వరదసాయం పొందే అంశాలపై, పంటల కొనుగోళ్లపై జిల్లాల అధికారులతో చర్చించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్ కు రిపోర్టు ఇవ్వాలని అన్నారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్టు ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, వరదలకు దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు. చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని, అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.16 జిల్లాలపై తుపాను ఎఫెక్టు ఉందని సమాచారం ఇచ్చారు. కేంద్రం హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని, వరికోతల కాలంలో అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.