ఎబోర్డ్ ఎయిర్‌ఫోర్స్ వన్ : అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో ట్రంప్, జిన్‌పింగ్ దక్షిణ కొరియాలో భేటీ కావడం కీలక పరిణామం. జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీకి దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వేదికైంది. ఈ సందర్భంగా అనేక కీలక అంశాలపై వీరు చర్చించారు. జిన్‌పింగ్‌తో భేతీ తరువాత చైనాపై విధించిన టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు ఎబోర్డ్ ఎయిర్ ఫోర్స్ వద్ద విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఫెంటనిల్ విక్రయిస్తుందని అపరాధం కింద చైనాపై విధించిన 20 శాతం సుంకాలను 10 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల చైనాపై సుంకాల రేటు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గుతుంది. జిన్‌పింగ్‌తో భేటీ అద్భుతంగా జరిగిందని తెలిపారు.
అమెరికా నుంచి సొయబీన్ చైనా తిరిగి కొనుగోలు చేయడానికి, అరుదైన ఖనిజాల ఎగుమతికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్టు ప్రకటించారు. అత్యంత ఆధునిక కంప్యూటర్ చిప్స్ చైనాకు ఎగుమతిపై కూడా చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ ఆయన గొప్పనేత అని, ఆయనకు 10 కి 12 మార్కులు ఇస్తానని వ్యాఖ్యానించారు.దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సు వేదికగా దాదాపు 100 నిమిషాల పాటు ఇరువురు నేతలు చర్చించారు. తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతికతల వృద్ధి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి ప్రపంచ సమస్యలపై చర్చించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో తాను పర్యటిస్తానని, ఆ తర్వాత జిన్‌పింగ్ కూడా అమెరికా వస్తారని ట్రంప్ చెప్పారు.
అణుపరీక్షలు తిరిగి ప్రారంభించాలి: ట్రంప్ ఆదేశం
అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌ను ఆదేశించినట్టు ట్రంప్ వెల్లడించారు. రష్యా, చైనా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు ప్రాథాన్యం సంతరించుకున్నాయి. ఈమేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. “ ప్రపంచంలో ఇతర దేశాల కంటే యూఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉంది. నా మొదటి పదవీ కాలం లోనే దీన్ని సాధించాం. దీనికి విపరీతమైన విధ్వంసక శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు అవి సమానంగ ఉంటాయి. ఇతర దేశాల్లో దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను యుద్ధశాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది ” అని ట్రంప్ రాసుకొచ్చారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపులో భారత్ “వెరీ గుడ్”
రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తగ్గింపులో భారత్ ‘ వెరీగుడ్’ అని ట్రంప్ కితాబు ఇచ్చారు. భారత్ మరింత తగ్గిస్తుందని ఆయన చెప్పారు. దక్షిణ కొరియాలో ఆన్‌బోర్డ్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులు అడగ్గా ఈ విషయం చెప్పారు. రష్యా నుంచి చాలా కాలంగా బారత్ చమురు కొనుగోలు చేస్తోందని , కానీ వాస్తవానికి చమురు గురించి తాము మాట్లాడడం లేదని, యుద్ధం ముగింపు జరిగితే కలిసి పనిచేస్తామని చర్చించుకున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా చమురు కొనుగోలు రష్యా నుంచి తగ్గిస్తామని భారత్ చెబుతోందని పేర్కొన్నారు.