ముంబైలో కిడ్నాపైన 20 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా కాపాడు. చిన్నారులను రక్షించే ప్రయత్నంలో కిడ్నాపర్ రోహిత్ ఆర్యను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. గురువారం (అక్టోబర్ 30) ముంబైలోని పోవై ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో కిడ్నాపర్ రోహిత్ చాలా మంది పిల్లలను బందించాడు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగి చిన్నారులకు కాపాడారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ” చిన్నారులను కాపాడేందుకు ఆర్ఏ స్టూడియోలోకి పోలీసులు బాత్రూమ్ డోర్ నుంచి ప్రవేశించారు. అయితే, నిందితుడి వద్ద ఎయిర్ గన్ తోపాటు పలు రసాయన పదార్థాలు ఉన్నాయి. పోలీసులు పదేపదే లొంగిపోవాలని కోరారు. కానీ నిందితుడు అంగీకరించలేదు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి దిగజారడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో ఆర్యకు తుపాకీ గాయం అయింది. దీంతో అతన్ని వెంటనే చికిత్స కోసం జోగేశ్వరి ట్రామా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ కిడ్నాపర్ రోహిత్ మరణించాడు. తర్వాత పిల్లలందరినీ స్టూడియో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది” అని తెలిపారు.