న్యూఢిల్లీ : ఇరాన్ లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై అమెరికా మరో ఆరునెలల పాటు ఆంక్షల మినహాయింపు పొడిగించింది. గతంలో ఇచ్చిన మినహాయింపునకు గురువారంతో గడువు ముగియడంతో మళ్లీ ఈ గడువు పొడిగించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. దీంతో చాబహార్ పోర్ట్ లోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి నిర్వహణకు భారత్‌కు వీలు కలిగింది. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం నిర్వహించడానికి చాబర్‌హార్ పోర్టు ప్రధాన మార్గం.
ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో భారత్‌దే కీలక పాత్ర. ఈ రేవులో 10 ఏళ్లపాటు టెర్మినల్ నిర్వహణ కోసం గత ఏడాది భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తరువాత ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తూ భారత్‌కు హెచ్చరికలు చేసింది. ఇదిలా ఉండగా అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావాన్ని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు.