పౌల్ట్రీ ఫార్మ్‌లో సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ కేటాయించేందుకు మెదక్ ట్రాన్స్ కో డీఈ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఒక రైతు వద్ద ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా గురువారం నాడు సాయంత్రం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఏసిబి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతా నగర్ గ్రామనికి చెందిన భాస్కర్ అనే రైతు తన పౌల్ట్రీ ఫార్మ్ షెడ్ కు సింగల్ ఫేస్ ట్రాన్సఫర్మర్ ఇవ్వాలని గత ఐదు నెలల నుండి విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ట్రాన్స్‌ఫార్మర్ కేటాయించలేదు. రూ.30 వేలు ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తామని చెప్పడంతో విసిగిపోయిన బాధితుడు భాస్కర్ ఎబిసిని ఆశ్రయించగా గురువారం రూ.9 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి మిగతా రూ.21వేలు నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. డిఈ కార్యాలయంతో పాటు పట్టణంలోని నివాసం, హైదరాబాద్ మెహదీపట్నంలోని తన సొంత నివాసంతో కలిపి మొత్తం మూడు చోట్ల సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. డిఈ పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.