వారణాసి(యూపీ) : వారణాసిలో కొత్తగా పారిశుద్ధ నిబంధనలను వారణాసి మున్సిపల్‌కార్పొరేషన్ అమలు లోకి తెచ్చింది. వాహనం నుంచి ఎవరైనా ఉమ్మివేస్తే రూ. 250 జరిమానా విధిస్తారు. అలాగే వాహనం నుంచి చెత్త పారేసినా, ఉమ్మి వేసినా రూ. 1000 జరిమానా కట్టక తప్పదు. వీధుల్లో తిరిగే జంతువులకు ఆహారం విడిచిపెడితే రూ. 250 జరిమానా తప్పదు. ఎవరైనా తమ నివాస పరిసరాల్లో చెత్తను 24 గంటలపాటు ఉంచినా, బహిరంగ ప్రదేశాల్లో, పార్కులు, రోడ్లపై చెత్తను పారేసినా రూ.న 500 జరిమానా విధిస్తారు. పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేస్తే శుభ్రం చేయకపోతే రూ. 500 జరిమానా విధిస్తారు.
నదులు, కాలువలు, లేదా మురికి కాలువల్లో వ్యర్థాలను గుమ్మరిస్తే రూ. 750 జరిమానా చెల్లించవలసి వస్తుంది. వ్యర్థాలను లేదా శిథిలాలను ఓపెన్‌ట్రక్కుల్లో రవాణా చేసినా, మున్సిపల్ వాహనాలకు, కుండీలకు, తొట్టెలకు నష్టం కలిగించినా, రూ. 2000 జరిమానా చెల్లించుకోవాలి. మురికి నీరు పారకుండా స్తంభించిపోయినా, అపారిశుద్ధ పరిస్థితులు కల్పించినా గరిష్ఠంగా రూ.5000 జరిమానా చెల్లించక తప్పదని విఎంసి పబ్లిక్‌రిలేషన్స్ అధికారి సందీప్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ స్వంత నియోజకవర్గంలో పరిశుభ్రత, పారిశుద్ధం ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండేలా తీసుకుంటున్నచర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.