సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని వారసత్వం తెలుగు సినీ పరిశ్రమలో విశిష్టమైనది. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా వెలుగులోకి రానున్నది జాన్వి ఘట్టమనేని. ఆమె తన తాత కృష్ణ ఛరిష్మా, తన మామ మహేష్ బాబు మాగ్నటిజం, తల్లి మంజుల ఘట్టమనేని ఆత్మీయతను తనలో కలుపుకుని గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది. జాన్వి ఘట్టమనేని క్లాసిక్ బ్యూటీ. ఇటీవల వెలుగుచూసిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు ఆమెను ఇటీవలి తెరపై కనిపించే అత్యంత అందమైన అమ్మాయిగా అభివర్ణిస్తున్నాయి. జాన్వి ఎటువంటి హడావుడి లేకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని ఫొటోలు, కొన్ని టెస్ట్ రీల్స్ ద్వారానే తన చార్మ్ చూపించింది. దర్శకులు ఆమె నటనను చూసి మాటల కన్నా కళ్ళతోనే భావాలను చెప్పగల సహజ నటిగా వర్ణించారు.
ఆమె ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ప్రత్యేకం. పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, గేమింగ్ ప్రతి విషయంలోనూ సమాన ఆసక్తి చూపిస్తుంది. జిమ్‌లో ట్రైనింగ్‌తో మొదలై తన డే, నైట్ తన ఆర్ట్ కార్నర్‌లో ముగుస్తుంది. కొత్తగా సినీ రంగంలోకి వచ్చే వాళ్లు సాధారణంగా ఒకే గుణంతో గుర్తింపుపొందుతారు. కానీ జాన్వి ఘట్టమనేనిది మాత్రం అందం, మాధుర్యం, ప్రతిభ, వారసత్వం.. ఈ నాలుగింటినీ కలగలిపిన ప్రత్యేక వ్యక్తిత్వం. జాన్వి సంప్రదాయ లుక్ నుంచి మోడరన్ గ్లామర్ వరకు సునాయాసంగా మెరిసిపోతుంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు గుర్తింపు వచ్చేసింది. ఒక అద్భుతమైన జ్యువెలరీ క్యాంపెయిన్ తర్వాత, జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించారు. పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో కెమెరా ముందుకొచ్చిన జాన్వి తన సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆమె నటన, నృత్యం నేర్చుకుంటూ తన ప్రతిభను నైపుణ్యంగా మార్చుకుంది.