దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ టీం ఇండియా జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ప్రత్యర్థులపై తన ప్రతాపం చూపించాడు. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ అర్థ శతకం సాధించి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే తాజాగా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకును సాధించాడు. 36 రేటింగ్ పాయింట్ల మెరుగుపర్చుకొని తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.
తద్వారా అతి లేటు వయస్సులో నెం.1 ర్యాంకు సాధించిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నెం.1గా ఉన్న తన సహచరుడు, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను రోహిత్ వెనక్కి నెట్టాడు. ఆసీస్ సిరీస్‌లో విఫలమైన గిల్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానంలో స్థిరపడ్డాడు. ఇక విరాట్ ఒక స్థానం కోల్పోయి.. ఆరో స్థానానికి పడిపోగా.. ఈ సిరీస్ రెండో వన్డేలో అర్థ శతకంతో రాణించిన శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.
బౌలర్లలో అఫ్గానిస్థాన్ స్టార్ రషిద్ ఖాన్ మొదటిస్థానంలో కొనసాగుతుండగా.. టాప్ 10లో టీం ఇండియా నుంచి కుల్దీప్ యాదవ్ మాత్రం ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరగా.. అప్గానిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ప్రథమ స్థానంలో సెటిల్ అయ్యాడు.