మొంథా తుపాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా, దేవరకొండ అతలాకుతలమైంది. మండలంలోని కొమ్మెపల్లి గ్రామంలో ఎస్‌టి ఆశ్రమ గురుకుల పాఠశాల, కళాశాల వరద నీటిలో చిక్కుకుపోయింది. ఎగువ నుండి వస్తున్న భారీ వరద ప్రవాహంతో పాఠశాల భవనం చుట్టూ నీరు చేరింది. దీంతో పాఠశాలలో ఉంటున్న 540 మంది విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్‌పి శరత్ చంద్ర పవార్ పాఠశాలకు చేరుకొని సిబ్బంది సహాయంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఒకరినొకరు చేతులు పట్టుకొని గొలుసుకట్టుగా పాఠశాల భవనం నుంచి రోడ్డు వరకు తీసుకువచ్చి వారిని ప్రత్యేక వాహనాల్లో కొండబీమనపల్లి పరిధిలో కొనసాగుతున్న బిసి హాస్టల్‌కు తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. కొండబీమనపల్లి గ్రామ సమీపంలో పర్షాతండా సమీపంలోని కుంట పూర్తిస్థాయిలో నిండి తెగిపోయే ప్రమాదం ఉండటంతో తండావాసులు
విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు పర్షతండాను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రతలపై అధికారులకు సూచించారు. మండలంలోని ఉప్పువాగు, మైనంపల్లి వాగు, తాటికోల్ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. తాటికోల్ వాగు బ్రిడ్జి పైనుంచి పారడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మండలంలోని శేరిపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. రోడ్డుపై నీరు పారింది. దేవరకొండ పట్టణంలోని మున్సిఫ్‌కోర్టు ఆవరణంలోకి నీరు చేరింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్‌డిఒ రమణారెడ్డి, ఎంపిడిఒ డానియేల్, ఎంఇఒ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపోయి రోడ్లకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.