మొంథా తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గండిపేట్ 6 గేట్లు, హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్ చేసి మూసీలోకి నీటిని అధికారులు విడుదల చేశారు. జంట చెరువులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట చెరువుల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి 3400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 6 గేట్లు ఎత్తి 2240 క్యూసెక్కుల నీటిని,
హిమాయత్ సాగర్ జలాశయానికి 5800 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా 4 గేట్లు ఎత్తి 3963 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పర్యవేక్షిస్తున్నారు. అత్యవసరమైతే బయటికి రావాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. అధికారులు అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు.
కొట్టుకుపోయిన హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు…
కురుస్తున్న వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హిమాయత్ సాగర్ ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు ఎగ్జిట్-17 వద్ద ప్రవాహ ఉదృ్ధతికి రోడ్డు కొట్టుకుపోయింది. నీరు రోడ్డుపై నుండి ఉదృ్ధతంగా ప్రవహిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రతి సంవత్సరం హిమాయత్ సాగర్ గేట్లు ఓపేన్ చేయడం వల్ల సర్వీసు రోడ్డు కోట్టుకపోతుండటంతో స్థానికులు ప్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు.