కృత్రిమ మేధ అన్నీ రంగాలనూ ఉప్పెనలా తాకుతోంది. సర్వాంతర్యామిగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను చూపుతోంది. ఈ క్రమంలో విద్యా రంగంలోకి కూడా ఈ సాంకేతికత వచ్చి చేరుతోంది. తాజాగా ‘ఎఐ ఫర్ యంగ్ మైండ్స్ -ది ఫ్యూచర్ స్టార్ట్ నౌ’ పుస్తకం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందింది. గ్లోబల్ ఎఐ నివేదిక-2023 ప్రకారం ఎఐ నైపుణ్యాల అభివృద్ధిలో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. అమెరికా, జర్మనీలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2025 నాటికి భారతదేశ ఎఐ మార్కెట్ విలువ 7.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఆరోగ్యం, వ్యవసాయం, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో ఎఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విద్యా రంగంలో దాని ప్రభావం అత్యంత కీలకమైనదిగా మారుతోంది.
విద్యా రంగంలోకి కృత్రిమ మేధను తీసుకొచ్చేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి. చైనాలో మూడవ తరగతి నుంచే ఎఐని తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నిషన్ వంటి అంశాలను చిన్న వయసులోనే పరిచయం చేస్తోంది. స్మార్ట్ క్లాస్‌రూమ్స్ కూడా అభివృద్ధి చేసింది. ఇక దక్షిణ కొరియాలో కంప్యూటేషనల్ థింకింగ్, ఎఐ లిటరసీని ప్రాథమిక స్థాయిలోనే సాధారణ పాఠ్యాంశాలలో కలిపింది. సింగపూర్‌లో మాధ్యమిక స్థాయి నుంచే AI Literacy, Code for Fun వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం కల్పిస్తోంది. అమెరికాలో రాష్ట్రాలవారీగా ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఎఐ విద్యను అమలు చేస్తోంది. స్టెమ్ ఎడ్యుకేషన్, నైతిక ఎఐ వినియోగంపై ఎక్కువ దృష్టి. ప్రైవేట్ రంగంలో గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.కరోనా తర్వాత డిజిటల్ బోధన పెరిగింది. ఎఐ టూల్స్ (ChatGPT, Gemini, Generative AI) తరగతులలో సాధారణమయ్యాయి. ఇవి సమాచారం అందించినా, విశ్వసనీయతను నిర్ణయించేది మనిషే. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఒక క్లాసులో 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు వ్యక్తిగత శ్రద్ధ చూపడం కష్టం. కానీ కృత్రిమ మేధతో ఈ సవాల్‌కు పరిష్కారం లభిస్తుంది. విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని ఇటీవల ఒక సర్వే వెల్లడించింది. విద్యా రంగంలో సమగ్రత కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ టర్న్‌టిన్ ఈ సర్వే నిర్వహణకు ప్రోద్బలం అందించగా, ఇంగ్లాండ్‌కు చెందిన మార్కెట్ రిసెర్చ్ సంస్థ వాన్సన్ బోర్న్ సర్వే నిర్వహించింది.
ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, మెక్సికో, ఐర్లాండ్, అమెరికాలకు చెందిన 3500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలు సేకరించారు. భారత్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం విద్యపై కృత్రిమ మేధ సానుకూల ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కృత్రిమ మేధ లభ్యత చాలినంతగా ఉందని సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించారు. చదువులో, ఇతరత్రా పనుల్లో కృత్రిమ మేధను ఉపయోగించి ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చో తమకు తెలియదని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 50శాతం మంది పేర్కొన్నారు. ‘కృత్రిమ మేధ వల్ల కలుగుతున్న సానుకూల పరిణామాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్నాయి’ అని టర్న్‌టిన్ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ చైతాలి మొయిత్రా అన్నారు. ఎఐ టీచర్‌కు ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతను సహాయక సాధనంగా వాడితే విద్యను బలోపేతం చేస్తుంది.
కానీ ప్రత్యామ్నాయంగా తీసుకుంటే మనిషి యంత్రాల బానిసగా మారే ప్రమాదం ఉంది. ఎఐ విద్యను విజయవంతంగా అమలు చేయడానికి, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి. సాంకేతిక సౌకర్యాలను అందరికీ అందుబాటులో ఉంచడం, డేటా గోప్యతను రక్షించడం, గురుశిష్య సంబంధాలను బలోపేతం చేయడం అవసరం. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది అభ్యాసనాన్ని మరింత వ్యక్తిగతీకరించినదిగా, సమర్థవంతమైనదిగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయగలదు. అయితే, ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, నైతికంగా, సమానత్వ దృక్పథంతో అమలు చేయడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎఐ విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా మారనుంది. ఉపాధ్యాయుడి పాత్ర ‘సమాచారాన్ని అందించే వ్యక్తి’ నుండి ‘అభ్యాసనకు మార్గనిర్దేశం చేసే ఫెసిలిటేటర్’ గా మారుతుంది. కృత్రిమ మేధస్సు విద్యా రంగానికి ఒక శక్తివంతమైన వరం. ఈ సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం ఉజ్వలమైన, విజ్ఞానవంతమైన భవిష్యత్ తరాలను నిర్మించగలం.
దయ్యాల అశోక్, 95508 89907