అమరావతి: వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేశారు. సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సిఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరూ టీమ్‌గా పని చేశామని, కష్టంకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. మరో రెండో రోజులు ఇలానే పని చేస్తే మరింద ఊరట ఇవ్వగలుగుతామని, మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు.
ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందో చెప్పడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందివ్వాలని, బాధితులకు నిత్యావసర సరకులు వెంటనే అందించాలని, ముందస్తు చర్యల వల్లే నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని, తుపానును నివారించలేమని, ముందుజాగ్రత్తలతో నష్టాలను కొంతమేర నివారించగలుగుతామని వివరించారు. కలెక్టర్లు, అధికారులు రియల్ టైమ్ సమాచారం తెప్పించుకున్నారని, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేశారని బాబు ప్రశంసించారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారని, మున్సిపాలిటీల్లో డ్రెయిన్లు శుభ్రం చేయడంతో ముంపు బారిన పడకుండా చేశామన్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు పది వేల మందిని అందుబాటులో ఉంచామని, ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుందని, తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కల్పించామని బాబు స్పష్టం చేశారు.
ఎపిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీ చేయనున్నారు. మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీ చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. తక్షణమే సరఫరా చర్యలు ప్రారంభించాలని సివిల్ సప్లైస్ కమిషనర్ కు సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.