వేల కోట్ల రుణాలు తీసుకుని దేశం విడిచి పరారైన ఆర్థిక నేరస్థులను తిరిగి స్వదేశానికి రప్పించడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేరస్థులను తిరిగి రప్పించడంలో 35 శాతం వరకు విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయి. ప్రభుత్వ ఆర్థిక వనరులపై ఒత్తిడిని పెంచుతాయి. అభివృద్ధికి నిరోధకాలుగా పరిణమిస్తాయి. ఇది గ్రామీణ, పేద ప్రజలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక నేరాల కేసులు చాలా ఏళ్ల పాటు విచారణలో ఉండడంతో న్యాయ వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాక, నేరస్థులు తప్పించుకోడానికి దారులు వెతికే పరిస్థితి ఏర్పడుతుంది. మహా నగరాల్లో ఆర్థిక నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2018తో పోలిస్తే 2023లో ఈ నేరాలు దాదాపు 31% పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం విదేశాలకు భారత్ నుంచి పరారైన ఆర్థిక నేరగాళ్ల జాబితాలో పుష్పేష్‌బైద్, ఆశిష్ జోబన్‌పుత్ర, విజయ్ మాల్యా, సన్నీకల్రా, సంజయ్ కల్రా, సుధీర్ కుమార్ కల్రా, ఆర్తికల్రా, జతిన్‌మెహతా, ఉమేష్ పరేఖ్, కమలేష్ పరేఖ్, నీలేష్ పరేఖ్, నీలవ్ మోదీ గారవ్, ఏక్నాలవ్ గార్గ్ మోడీ, మెహుల్ చోక్సీ, సబ్యాసేథ్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, లలిత్ మోడీ, నితిన్ జయంత్‌లాల్ సందేశర, చేతన్‌కుమార్ సందేశర, రితేష్ జైన్, హితేష్ నరేంద్రభాయ్ పటేల్, మయూరి బెన్ పటేల్, ప్రీతి ఆశిష్ జోబన్‌పుత్ర తదితరులు సుమారు 75 మంది ఉన్నారు. ఈ మోసగాళ్ల నుంచి ఇప్పటివరకు 15.113 కోట్ల రూపాయలను రికవరీ చేసినట్టు కేంద్రం తెలియజేసింది. ఇంకా వీరిలో చాలా మందిని తిరిగి రప్పించి శిక్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించడానికి బెల్జియం కోర్టు అంగీకరిస్తూ తీర్పు చెప్పడం భారత్ చేసిన ప్రయత్నాల్లో ముఖ్యమైన పరిణామం. చోక్సీ 2018లో భారత్ నుంచి పరారైన దగ్గర నుంచి భారత్ అతడ్ని వెనక్కు రప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ అభ్యర్థనపై చోక్సీని బెల్జియం నిర్బంధంలో ఉంచింది. భారత్‌కు తనను అప్పగిస్తే అక్కడ తాను నరకం అనుభవించవలసి వస్తుందని చోక్సీ వాదిస్తూ సమర్పించిన డాక్యుమెంట్లు సరిగ్గా లేవని బుధవారం బెల్జియం కోర్టు వెల్లడించింది. చోక్సీ భద్రతకు, అందుకు తగినట్టు జైళ్ల ఏర్పాట్లకు హామీ భారత్ ఇచ్చిన నేపథ్యంలో భారత్ జైళ్లలో తనను సరిగ్గా చూడరన్న చోక్సీ వాదనను బెల్జియం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు భారత్‌కు చోక్సీ అప్పగింత ఫలప్రదమైతే ప్రపంచం మొత్తం మీద గత రెండు దశాబ్దాలుగా భారత్‌కు అప్పగించిన మూడో వంతు ఆర్థిక నేరస్థుల సుదీర్ఘ జాబితాలో చోక్సీ పేరు చోటు చేసుకుంటుంది. ఈ ఏడాది భారత్ సాధించింది చోక్సీ కేసు ఒక్కటే కాదు. గత నెల బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ప్రతినిధి వర్గం జైళ్ల పరిస్థితిని సమీక్షించడానికి తీహార్ జైలును సందర్శించింది. విజయ్ మాల్యా, నిరావ్ మోడీ వంటి ఆర్థిక నేరస్థులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బ్రిటన్ నుంచి భారత్‌కు అప్పగించడానికి కావలసిన వెసులుబాటు కల్పించడానికే ఇదంతా. ఇటువంటి ఆర్థిక నేరస్థులపై దర్యాప్తులు, విచారణ సాగించడానికి లేదా శిక్షించడానికి ఆయా దేశాల్లో ఉన్న నేరస్థులను భారత్‌కు అప్పగించాలన్న అభ్యర్థనలు జోరందుకుంటున్నాయి. ఈ మేరకు 48 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాలతో నేరస్థుల అప్పగింతలకు సంబంధించిన ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. అలాగే 12 దేశాలతో అప్పగింత ఏర్పాట్లు చేసుకుంది. గత ఐదేళ్లలో 133 నేరస్థుల అప్పగింతల అభ్యర్థనలను భారత్ చేసింది. 2020 నుంచి 2024 కాలంలో ఒక్క 2024 లోనే 39 అభ్యర్థనలను చేయడం విశేషం. అలాగే భారత్ నుంచి పరారైన నేరస్థుల అప్పగింతలకు సంబంధించి విదేశాల నుంచి 79 అభ్యర్థనలను 202024 లో అందుకోగలిగింది. విదేశాల నుంచి భారత్‌కు ఆర్థిక నేరస్థులను, మోసగాళ్లను, ఫోర్జరీ కేసుల నేరస్థులను అప్పగించడంలో 2022 నుంచి 35 శాతం వరకు సాధించడమైంది. అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ ఒప్పందం స్కామ్‌కు సంబంధించి ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుడు క్రిస్టియన్ మేకేల్ యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు అప్పగించడమైంది. మొత్తం కేసుల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న లేదా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించిన, భారత్‌కు వ్యతిరేకంగా దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్న నేరస్థుల కేసులు 27.5 శాతం వరకు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా ఈ ఏడాది భారత్‌కు అప్పగించింది. భారత్‌కు అప్పగించనున్న నేరస్థుల మొత్తం కేసుల్లో హత్య లేదా హత్యాయత్నం కేసులు 21.3 శాతం ఉన్నాయి. మాదకద్రవ్యాలు, లైంగిక నేరాలు వంటి కేసులతో సహా మొత్తం కేసులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాబితా తయారు చేసింది. 2002 నుంచి 2018 మధ్యకాలం లోను, 2024 నుంచి 2025 కాలం లోనూ విదేశాల నుంచి అప్పగించిన నేరస్థుల జాబితాను దేశాల వారీగా వేర్వేరుగా ప్రదర్శించింది. ఈ రెండు దశల్లోనూ మొత్తం 26 దేశాల నుంచి నేరస్థులను భారత్ రప్పించుకోగలిగింది. అలాంటి మొత్తం కేసుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా దేశాలు కలిపి మొత్తం 46 శాతం ఉన్నాయి. క్రమంగా కనీసం 25, 12 మంది పరారీ నేరస్థులను ఆ రెండు దేశాల నుంచి రప్పించుకోగలిగింది.