అయోధ్యలో శ్రీ రామమందిర నిర్మాణం కోసం ప్రజలు రూ.3000 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం తెలిపారు.ఆలయం ప్రాజెక్టు అయ్యే మొత్తం వ్యయం దాదాపు 1,800 కోట్లు గా అంచనా వేశారని ఆయన తెలిపారు. ఇంతవరకూ రూ. 1500 కోట్ల మేరకు బిల్లింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.2022లో రామమందిర నిర్మామానికి నిధుల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు ఉదారంగా తమ విరాళాలను పంపారని మిశ్రా తెలిపారు. అయోధ్యలో నవంబర్ 25న భారీ ఎత్తున ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమానికి ఈ దాతలందరినీ ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
అలాగే, ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేస్తారని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ధ్వజారోహణ కార్యక్రమానికి కనీసం 8 వేల మందికి ఆహ్వానాలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 70 ఎకరాలలో నిర్మిస్తున్న ఆలయ సముదాయంలోని శేషావతార్ ఆలయం, కుబేర్ తిల, సప్త మండపాలను ప్రదాని సందర్శించే అవకాశం ఉంది.2024 జనవరి 22న రామాలయంలో బాల రాముడి విగ్రహా ప్రతిష్ట మోదీ సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ప్రధాన ఆలయంలో ఒకేసారి 5 నుంచి 8 వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చునని మిశ్రా అన్నారు. రామ మందిరంగా దర్శనం సులభంగానే జరుగుతుంది. దక్షిణ దర్శన మార్గం నుంచి వెళ్తే 20 నిముషాలు పడుతుంది. సుగ్రీవ్ కిలా వరకూ పూర్తి మార్గం లో దర్శనానికి వెళ్లాలంటే 40 నిముషాలు పడుతుంది.