వాతావరణ మార్పు ఆదివాసీ సమాజానికి ఎప్పుడో సంభవించే ప్రమాదం కాదు, -అది ఇప్పుడు వారి జీవనానికి ముప్పుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, తరచూ జరిగే అడవి అగ్నిప్రమాదాలు ఇవన్నీ ప్రకృతి- మనిషి మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. -ఈ మార్పులు అత్యంత బలహీన వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడే ఆదివాసీల జీవనోపాధులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఆదివాసీ రైతుల జీవితం ఎప్పుడూ రుతువుల లయకు అనుగుణంగా సాగేది. కానీ ఇప్పుడు ఆ లయ తప్పిపోయింది – వాతావరణం అస్థిరంగా, ఊహించలేనిదిగా మారింది. వేడి పెరగడంతో నేల తేమ తగ్గిపోతోంది, అకాల వర్షాలు పంటలను నాశనం చేస్తున్నాయి. వరి, పప్పుధాన్యాలు వేడిని తట్టుకోలేక దిగుబడి తగ్గిస్తున్నప్పటికీ, చాలాకాలంగా విస్మరించబడిన సిరిధాన్యాలే (మిల్లెట్స్) తట్టుకోగలుగుతున్నాయి.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (2012), భారత వ్యవసాయ పరిశోధన మండలి (2019) ప్రకారం, మిల్లెట్స్ తక్కువ వర్షపాతం ఉన్నా పండుతాయి. అందువల్ల అవి ఎండప్రాంతాల ఆహార భద్రతకు అత్యవసరమైనవని చెబుతున్నాయి. వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, రబీ పంటల సీజన్‌లో వర్షపాతం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలు నేల క్షీణత, కొండవాగుల వరదలతో హానిని కలిగిస్తున్నాయి. అందువల్ల నీటి నిల్వ వ్యవస్థలను బలోపేతం చేయడం, సంప్రదాయ కుంటలు, చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ ఆదివాసీ ప్రాంతాల్లో అత్యవసరం. లయ అనే స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, ఎఎస్‌ఆర్, మన్యం జిల్లాల్లోని చెక్‌డ్యామ్‌లు, వాగులు, కుంటల (81) ద్వారా సుమారు 177 ఎకరాలకే సాగు నీరు అందుతోంది. వాటిని మరమ్మతులు చేస్తే సుమారు 6,918 ఎకరాల వరకూ సాగు విస్తరించవచ్చని పేర్కొంది. ఈ నిర్మాణాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా సంబంధిత పథకాల ద్వారా పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. పశుసంవర్థక, మత్స్య సంపద కూడా వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల వల్ల పశువుల పాలు, ప్రసవ సామర్థ్యం తగ్గుతోంది. అస్థిర వర్షపాతం వల్ల చెరువుల్లో చేపల పెంపకం దెబ్బ తింటోందని నాబార్డ్ (2019) నివేదిక తెలిపింది. కొండలపై కురిసే వర్షాలతో రసాయన ఎరువులు, పురుగు మందులు కొండ వాగు నీటిలో కలసి తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అడవులు ఆదివాసీల ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితాలకు మూలాధారం. కానీ అవి కూడా వాతావరణ మార్పుల ముప్పు నుండి తప్పించుకోలేకపోతున్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (2019) ప్రకారం అటవీ ప్రాంతాల్లో 53 శాతం అగ్నిప్రమాదాల ముప్పులో ఉన్నాయి. వాటిలో పావు వంతు అత్యధిక ప్రమాద వర్గంలో ఉన్నాయి. తరచూ సంభవించే అగ్నిప్రమాదాలు, వేసవి కాలం పెరగడంతో తేనె, వెదురు, పండ్లు, ఔషధ మూలికల ఉత్పత్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు అడవుల్లో వేలాడే తేనెగూళ్లు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి. వెదురు పునరుత్పత్తి తగ్గడంతో కళాకారులు, గృహనిర్మాణ పనులకు ఇబ్బంది కలుగుతోంది. ఔషధ వనమూలికలు ఇప్పుడు ఎత్తైనచల్లని కొండప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి.
సహజ అడవుల స్థానంలో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఒకే రకం చెట్ల పెంపకం (మోనో కల్చర్) చేపట్టడంతో సమతుల్యం దెబ్బతింటోంది. ఆక్రమణ జాతులు విస్తరించడం వల్ల సహజ వనాల పెంపుకు ఆటంకం కలుగుతోంది. ఇవన్నీ పర్యావరణ సమతుల్యాన్ని మాత్రమే కాదు, నీటి మట్టాన్ని తగ్గించి ఎడారీకరణకు దారితీస్తున్నాయి. ఆదివాసీలకు ఇది కేవలం పర్యావరణ నష్టం కాదు – సాంస్కృతిక ఉనికిపై దెబ్బ. భారీ నీటి ప్రాజెక్టులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. వేలాది ఆదివాసీ కుటుంబాలను అడవులనుంచి వేరుచేసి, వారి సాంప్రదాయ వారసత్వాన్ని నాశనం చేస్తోంది. అడవులు తగ్గిపోవడం, నీటి వనరులు మృగ్యం కావడం వల్ల వన్యప్రాణులు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పంటలు, పశువులు నాశనం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రకృతి- మనిషి సహజ సంబంధం ఉన్న చోట ఇప్పుడు బతుకుబాట కష్టమవుతోంది.
తూర్పు కనుమలు ఒకప్పుడు దట్టమైన హరితం, తేమతో నిండిన ప్రాంతాలు. కానీ ఇప్పుడు జీవవైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి – వాతావరణ మార్పులు, భూమి వినియోగ మార్పులు కలిసి మొక్కల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. గత 100 సంవత్సరాల్లో (1920- 2015) తూర్పు కనుమల్లో 15.83% అటవీ ప్రాంతం నశించింది. అందులో 7.92% వ్యవసాయ భూమిగా, 3.8% పొదల భూమిగా మారింది. నేల సారవంతత తగ్గి, పంటల కాలచక్రం భగ్నమవుతోంది. వర్షాభావం వల్ల జీవనోపాధి కోసం మైదాన ప్రాంతాలకు ఆదివాసీ వలసలు పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం కోల్పోవడం అంటే వారి సంప్రదాయ పర్యావరణ జ్ఞానం కోల్పోవడమే. ఈ కఠిన పరిస్థితుల్లో కూడా ఆదివాసీ సమాజాలు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రియ ఎరువులు, మిశ్రమ పంటలు, విత్తన బ్యాంకులు, సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటల పునరుద్ధరణ వంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి. ఇవి పోషకాహార భద్రతకు దోహదం చేస్తున్నాయి.
వాతావరణ మార్పు, ఆరోగ్య రంగంలో రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక (2022- 27) స్థానిక వ్యాధి పర్యవేక్షణ, ఆరోగ్య సిబ్బంది శిక్షణ, సంప్రదాయ -ఆధునిక వైద్య సమన్వయం అవసరాన్ని గుర్తించింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ప్రకారం గ్రామ సభలకు సముదాయ అటవీ వనరుల నిర్వహణ హక్కు ఉంది. చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే, వెదురు, పండ్లు, ఔషధ మొక్కల పెంపకం ద్వారా ఆదాయం పెరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యం కూడా కాపాడుతుంది. ఆదివాసీలకు వాతావరణ మార్పులు కేవలం పర్యావరణ సమస్య కాదు – అది న్యాయం, జీవనాధారం, ఉనికికి సంబంధించిన ప్రశ్న. వారి భూములు, అడవులు, సంప్రదాయ జ్ఞానం ప్రమాదంలో ఉన్నాయి.
కానీ ప్రకృతితో ఉన్న అనుబంధమే వారికి ప్రతిఘటనకు బలం. సాంప్రదాయ జ్ఞానాన్ని శాస్త్రీయ సాంకేతికతతో మిళితం చేస్తే సమగ్ర వాతావరణ చర్య సాధ్యమవుతుంది. ఇది అడవులను పునరుద్ధరిస్తుంది, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంది, నీటి భద్రతను కాపాడుతుంది, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుంది. వాతావరణ ప్రణాళిక గ్రామస్థాయిలోనే రూపుదిద్దుకోవాలి. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీ (విస్తరణ) చట్టం (PESA), అటవీ హక్కుల చట్టం కింద గ్రామ సభలను ప్రణాళిక, పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలి. వాతావరణ మార్పు ప్రతిఘటనలో ఆదివాసీ నాయకత్వం నిలపడమే కాదు -అది సుస్థిర భవిష్యత్తుకూ అత్యవసరం. గిరిజన సంక్షేమ, వ్యవసాయ, అటవీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి, గణాంకాలకే కాకుండా ఆదివాసీ విజ్ఞాన ఆధారిత వాతావరణ చర్యకు ప్రభుత్వం పూనుకోవాలి.
డా. పల్లా త్రినాథరావు
96182 96682