హైదరాబాద్: కార్మికుల కష్టాలు తెలియనంతగా తనకు కళ్లు మూసుకుపోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సిఎం రేవంత్ రెడ్డికి సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చిన పదేళ్లు సినీ అవార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేది తన సంకల్పమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐటి, ఫార్మా పరిశ్రమలు ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే అని సిఎం పేర్కొన్నారు. అందరూ అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తానని అన్నారు. హాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో, హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరిగేలా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సినీ కార్మికుల పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు. వాళ్ల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో పాఠశాల నిర్మించి.. ఉచితంగా చదువు చెప్పిస్తామని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని సిఎం అన్నారు. సినీ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. టికెట్ల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని తెలిపారు. అలా చేస్తేనే.. టికెట్ల ధర పెంపునకు జివొ ఇస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణనికి ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ ట్రైనింగ్‌కు స్థలం కేటాయిస్తామని తెలిపారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికులతో మాట్లాడతామని సిఎం అన్నారు. సినీ కార్మికులకు ఏం చేస్తామో డిసెంబర్ 9న వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే ఇతర ఇండస్ట్రీ నేర్చుకునేలా తయారు చేస్తా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం, వేం నరేందర్ రెడ్డి, సినీ నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు.