సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోరుకుంటున్నాడని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. వన్డే సిరీస్ అనంతరం రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మంగళవారం కాన్‌బెర్రాలో సూర్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ కోలుకుంటున్నాడని తెలిపారు. అయ్యర్ అందరితో మాట్లాడుతున్నాడని.. మెసేజ్ లకు కూడా రిప్లే ఇస్తున్నాడని సూర్య చెప్పాడు.
“శ్రేయస్ గాయం గురించి తెలియగానే, నేను మా ఫిజియో కమలేష్ జైన్‌కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాను. దేవుడి దయ వల్ల, అంతా బాగానే ఉంది. అయ్యర్ పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. అందరితో మాట్లాడుతున్నాడు, ఫోన్‌లో రిప్లై ఇస్తున్నాడు. ఐసియు నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షనలో ఉన్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. టీ20 సిరీస్ తర్వాత మేము అతనితో కలిసి ఇండియాకు వెళ్తాం” అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరుజట్ల మద్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.