ఇరవై ఏళ్లకుపైగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పరచుకున్న పునాదులు సంక్షోభం దిశగా కూరుకు పోయాయి. తాజాగా సోడి తిరుపతి, రవి అనే వారిని మావోయిస్టు పార్టీ మట్టుబెట్టడం తాజా పరిణామం అయితే వాళ్ళు సామూహిక లొంగుబాటు కంటే ముందు లొంగిపోయిన వారా, ఇన్ఫార్మర్లని అనుమానించినవారైతే వారి మరణం మావోయిస్టు పార్టీ ప్రజాకోర్టు పేరుతో తమకుతాముగా దళాలు అమలు జరిపిన ప్రతీకార చర్యనే అవుతుంది. అలా కాకుండా సామూహికంగా లొంగిపోయిన వారికి శిక్షవేసి ఉంటే అది మరో అంతర్గత యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. గత రెండేళ్ళుగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దండకారణ్యం మీద ఉక్కుపాదం మోపింది. మావోయిస్టుపార్టీ, కేంద్ర బలగాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావు తోపాటు, అనేక మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. కేంద్ర బలగాల కూంబింగ్‌లో 600 మంది వరకు మావోయిస్టు కేడర్ మరణించింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 డెడ్ లైన్ కూడా మావోయిస్టు పార్టీకి విధించింది. ఈ దశలో మావోయిస్టు పార్టీకి ముందున్నది రెండే ప్రత్యామ్నాయాలు. 1) చనిపోయినా పర్వాలేదు, ఉన్న సైద్ధాంతిక వెలుగులో కడదాకా పోరాడటం లేదా వ్యూహాత్మకంగా వెనకడుగువేసి తమనితాము కాపాడుకోవడం. 2) లొంగిపోవడం ద్వారా తమతో పాటు దళాల్లోఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, సాయుధ పోరాటం విరమించి, ఆయుధాలు అప్పగించి, ప్రాణాలు కాపాడుకోవడం, మావోయిస్టు పోరాట రూపం మార్చుకొని పని చేయడమా? లేక ఇప్పుడు ఉన్న కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోవడమా? ఈ రెండు అంశాల గురించి పరిశీలన గనుక జరిగితే! మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో ఇరవై ఏళ్ళుగా ఆచరణాత్మకంగానే పోరాడి నష్టాలు చవిచూశారు.
జరిగిన నష్టాల నుండి బయటపడి నిలబడడానికే కాల్పుల విరమణ, చర్చలు జరపాలని వ్యూహాత్మకంగానే మావోయిస్టు పార్టీ ముందుకు తెచ్చింది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికే సిద్ధం అయింది తప్ప పట్టుజార విడువలేదు. ఈ దశలో కొందరు మేధావి వర్గం సూచనలు, సైద్ధాంతికపరమైన కాలదోషం తదితర విషయాలుపై జరిగిన చర్చ కూడా మిగిలిన మావోయిస్టు కేడర్‌పై కొంత ప్రభావం చూపితే చూపి ఉండవచ్చును. దాని పర్యావసానాలు కూడా మావోయిస్టు పార్టీలో అంతర్గత వైరుధ్యాలు తీవ్రతరం అయి ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ @ సోనూ @ అభయ్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు @రూపేష్ @ సతీష్ తమతమ డివిజన్ సాయుధులతో కలిసి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు పోతే సమకూర్చుకోవడం తేలికనే! కానీ, ప్రాణాలుపోతే తిరిగి తేవడం చాలా కష్టం! ఒక రకంగా గత్యంతరం లేని స్థితిలోనే వారు నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చును. ఆయుధాలు అప్పగించే షరతుపై లొంగిపోయినప్పడు వారు నవ్వారా? ఏడ్చారా? అనే విషయాలు పక్కనపెడితే! ఇక్కడ సాముహిక లొంగుబాటు కనుక ఖచ్చితంగా సైద్ధాంతిక మార్పులో భాగంగానే జరిగింది అనేది అర్థం అవుతుంది.
మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు ముందు జనతన సర్కార్, పిజిఎల్‌ఎ ఏర్పాటు తదితర విషయాలను ఆయన తప్పిదాలని బహిరంగంగా ప్రకటించాడు. ఆచరణలో వచ్చిన తప్పిదాలు కూడా ఆయన స్థాయిలో ఆయన లేఖ ద్వారా చర్చించాడు. కనుక లొంగిపోయిన వారు ఆయుధం లేకుండా పని చేసుకుంటామని ప్రకటన కూడా చేశారు. ముందు ప్రాణాలు నిలుపుకొని, తదుపరి ఉద్యమం రూపకల్పన చేసుకుందామనే ఎత్తుగడ కావచ్చును లేదా బతుకుజీవుడా అని వచ్చిన అవకాశం తీసుకొని ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు జీవితం గడిపినా కొందరు గడపవచ్చును. అది వారి వారి ఇష్టం. కానీ, జరిగే అసమాన యుద్ధం, రక్తం పాతం నుండి వ్యూహాత్మకంగా ఈ వర్గం బయటపడిందనే చెప్పాలి. ప్రజల్లో వారు ఉంటారా, ఉండరా అనే విషయం కాలం నిగ్గు తేల్చుతుంది. అయితే సైద్ధాంతికంగా మార్పు చెందిన వర్గం ప్రతిపాదనల మూలం గా ప్రభుత్వ సైనిక చర్య తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభుత్వం కూడా వేచిచూసే ధోరణితో ఉంది. దండకారణ్యం లో గత రెండు నెలలుగా సామూహిక ఎన్‌కౌంటర్స్ తగ్గిపోయాయి.
ఈ వాతావరణాన్ని లొంగిన నక్సల్స్ వర్గం పూర్తిగా వినియోగించుకొనగా, మావోయిస్టు సిద్ధాంతాలకు, సాయుధ పోరాటానికి కట్టుబడినవారికి సైతం ఈ సంధికాల సమయం కుదురుకోవడానికి కొద్దిగా వెసులుబాటునైనా లభించింది. మావోయిస్టులు ఖచ్చితంగా ఈ విషయం గమనించాలి. రెండో రకం లొంగిపోయిన నక్సల్స్ ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటుకు వెళితే బాగుండేది అనే ఆలోచన సైతం బయట మావోయిస్టు సానుభూతిపరులకు ఆవేదనగా ఉంది. ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటు అనేది లేదనేది అవతల పక్షం విధించిన ఒకానొక షరతు. కనుక ఆయుధాలు అప్పగించి లొంగిపోయినవారు లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ మూల సిద్ధాంతానికి కట్టుబడిన కేంద్ర కమిటీ సభ్యులు, దళాలు ఇంకా దండకారణ్యం లో కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత నష్టాలు లేకుండా బయటపడ్డమే ఇప్పుడు మిగిలిన మావోయిస్టుల కర్తవ్యం కూడా. దానితో పాటు నష్టాలనుండి తేరుకుని కొంతలో కొంత అయినా భేష్ ఏరియా కాపాడుకోవడం వారికి ఆచరణాత్మక చాలెంజ్‌నే.
అయితే, ఎంతవరకు నిలబడతారు? ఎంత కాలం నిలబడతారు? అనేది కాలం నిగ్గు తేల్చాల్సిన సమస్యనే? ఇప్పుడు దండకారణ్యం సరిహద్దులో తెలంగాణ ఉండడం, బిజెపి వ్యతిరేక కాంగ్రెస్ అధికారంలో ఉండడం మావోయిస్టు లకు కాస్తా ఊరటననే చెప్పవచ్చును. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా నక్సలైట్లు లొంగిపోవాలని కోరుతున్నారు. రేపు ఈ విషయంలో ఇక్కడ సర్కార్ కూడా ఈమాత్రం వెసులుబాటు ఇస్తుందని భావించలేము? ఇక్కడే మావోయిస్టుల మధ్య మరో వైరుధ్యం చేరింది. లొంగి పోయిన, లొంగిపోని నక్సలైట్ల మనుగడ సమస్య ఇప్పుడు ఒకరి ఉనికి మరొకరి మనుగడకు ప్రమాదకరం కానుంది. ఇప్పటివరకు ప్రభుత్వ దళాలతో తలపడిన మావోయిస్టులు అంతర్గత పోరుతో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. లొంగిన మావోయిస్టులు ద్రోహులు అని, వారికి ప్రజలే శిక్ష వేస్తారని మిగిలిన మావోయిస్టులు బహిరంగ ప్రకటనే చేశారు. అంటే వారిని హతమార్చుతామనే సంకేతమే ఇచ్చా రు. ఇలా ప్రకటన చేయడం మావోయిస్టు పార్టీకి కొత్తకాక పోవచ్చును. కానీ, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి గడ్డుకాలమే? ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న స్టేట్ టెర్రరిజం బహిరంగంగా తేదీ ఇచ్చి హతమార్చుతామని చేసే ప్రకటనకు, మావోయిస్టు పార్టీ లొంగిపోయిన తమ మాజీలను చంపుతామని చేసే ప్రకటనకు తేడా ఏమైనా ఉందా? అంటే, లేదనే చెప్పాలి.
నిజంగా మావోయిస్టు పార్టీని రెండు వర్గాలుగా చీలడం వల్ల ప్రభుత్వం నక్సల్స్‌ను బలహీనపరచాలన్న లక్ష్యం చాలా తేలిక అవుతుంది. నిర్మూలించడంలో తమ చేతికి మట్టి అంటకుండా రెండు వర్గాల ఘర్షణను ప్రోత్సహించే అవకాశం ఉంది. కనుక మావోయిస్టులు ప్రస్తుత చీలిక ఒకరిపై మరొకరు ద్వేషంతో దాడులవరకు వెళ్ళకుండా ఎవరి పంథాలో వారు పని చేసుకోవడం వలన సైద్ధాంతిక సానుకూలత ఉన్న వర్గం ప్రజల్లో నిలబడుతుంది. లేని వర్గం దానికదే ప్రజలనుండి వేరుపడి అదృశ్యం అవుతుంది. కనుక మావోయిస్టులు ఘర్షణ వాతావరణం నివారణ దిశగా పయనించడమే కొంతలో కొంతైనా లొంగిపోయిన వర్గం నిలబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. గతంలో వివిధ నక్సల్స్ వర్గాల అంతర్గత ఘర్షణల అనుభవాలు నక్సల్స్ ఉద్యమాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఇల్లెందు, సిరిసిల్ల ప్రాంతాల్లో జరిగిన భౌతిక ఘర్షణలు ఆయా వర్గాలకు క్యాడర్ నష్టపోవడం తప్ప ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కనుక మావోయిస్టు పార్టీ కష్టకాలంలో మరింత విజ్ఞతతో మెలగవలసిన అవసరం మాత్రం ఉంది. దండకారణ్యంలో శాంతిని కాపాడాల్సిన కర్తవ్యం కూడా మావోయిస్టు పార్టీ పైనే ఉంది. రెండు పంథాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యం కూడా శాంతి మార్గంలోనే సాధ్యం అవుతుంది తప్ప! బలప్రయోగం ఇప్పటికీ ఎప్పటికీ అటు ప్రభుత్వం చేసినా, ఇటు నక్సల్స్ చేసినా జీవించే హక్కును కాలరాయడమే!
– ఎన్.తిర్మల్
94418 64514