ఆర్థిక నేరస్థుడి వద్ద నుంచి టాస్క్‌ఫోర్స్ ఎస్సై రూ.౨ కోట్లు తీసుకుని తప్పించడంపై పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయంశం అవుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిసిఎస్‌లో నమోదైన రూ.3,000 కోట్లు మోసం కేసులో నిందితుడు కుటుంబంతో పాటు నగరం నుంచి పరారయ్యాడు. నిందితుడు నగరంలోని చిట్టీలు, ఫైనాన్స్, అధిక వడ్డీలు, స్కీంల పేరుతో అమాయకులకు ఆశ చూపించి దాదాపుగా రూ.3వేల కోట్ట రూపాయలు వసూలు చేశాడు. తర్వాత కుంటుంబాన్ని తీసుకుని పరారయ్యడు. దీంతో బాధితులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కేసును పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌లో ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేశారు.
ఇందులో ఎస్సై సభ్యుడుగా ఉన్నాడు.నిందితుడు తన ఇద్దరు కుమార్తెలు, భార్యతో కలిసి ముంబాయిలో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందం వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. వాహనాల్లో తీసుకుని వస్తుండగా సదరు ఎస్సై ఒక్కడే మాత్రమే నిందితుడితో ఉన్నాడు. ఈ సమయంలోనే ఓ ఇన్స్‌స్పెక్టర్‌తో కలిసి ఎస్సై బేరానికి దిగి రూ.2కోట్లు క్యాష్ తీసుకుని మధ్యలో వదిలేసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ డిసిపి స్థాయి అధికారిని విచారణకు నియమించారు. డబ్బులు తీసుకున్న విషయం నిజమని తెలియడంతో ఎస్సైని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. క్యాష్ తీసుకున్నాడా లేదా ఆస్థి రూపంలో తీసుకున్నాడా అనే దానిపై ఎస్సైని పోలీసులు విచారిస్తున్నారు. క్యాష్ తీసుకుంటే అవి ఎవరెవరికి ఇచ్చాడు, ఎవరు ఎంత వాటా తీసుకున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఉన్నతాధికారుల పాత్ర…?
రూ.2కోట్ల ముడుపుల కేసులో ఒక ఎస్సై అంత డబ్బు తీసుకుని నిందితుడిని వదిలివేసే ధైర్యం ఉంటుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చెబితే తప్ప ఎస్సై స్థాయి అధికారి ఇంత పెద్ద రిస్క్ తీసుకోడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న ఎస్సై జూనియర్ అధికారి కావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎస్సై విచారణ పూర్తయితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.