నిజాం కాలంలో నిర్మించిన రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో మూసివేసిన 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని కూల్చివేసి కొత్తగా 10,880 కోట్ల వ్యయం తో 800 సూపర్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్ నిర్మాణానికి 650 ఎకరాల స్థలం అవసరం ఉండగా ప్రస్తుతం 580 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. మరో 9 ఎకరాల స్థల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యుత్ కేంద్రానికి కావాల్సిన బొగ్గు సింగరేణి సంస్థ నుంచి, నీరు సమీపంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి తీసుకోనున్నారు. విద్యుత్ కేంద్రం నిర్మాణంతో స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు.