2,601దుకాణాలకు లాటరీ ప్రక్రియ
19 మద్యం షాపుల డ్రా నిలిపివేత
వాటికి నవంబర్ 1నుంచి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ..3న డ్రా
మూడు షాపులను దక్కించుకున్న నర్సంపేటకు చెందిన ఓ కుటుంబం
నిర్మల్ జిల్లాలో ఓ మహిళను వరించిన రెండు దుకాణాలు
సంగారెడ్డిలో ఏకంగా మూడు షాపులను దక్కించుకున్న ఒకే వ్యక్తి
ఒకరు 50 దరఖాస్తులు చేసినా వరించని అదృష్టం
ధర్మాపూర్‌లో ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ4 మద్యం షాపుల కేటాయింపు కోసం సోమవారం నిర్వహించిన డ్రా ప్రశాంతంగా ముగిసింది. మ ద్యం షాపుల డ్రాను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. కా గా, 2, 601 మద్యం దుకాణాలకు డ్రా ప్రశాంతంగా జరగ్గా, మరో 19 మద్యం షాపుల డ్రాల ను ఎక్సైజ్ అధికారుల నిలిపివేశారు. ఆయా దు కాణాల పరిధిలోని మద్యం వ్యాపారులు సిండికే ట్ కావడం, తక్కువ దరఖాస్తులు రావడంతో 19 దుకాణాలకు సంబంధించిన డ్రాను నిలిపివేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల 50 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యక్తికి లక్కీ డ్రాలో అదృష్టం వరించకపోగా, ఒక్క దరఖాస్తు దాఖలు చేసిన వ్యాపారికి అదృష్టం వరించడం విశేషం. మద్యం షాపుల కోసం నిర్వహించిన టెండర్లలో ఓ కుటుంబాన్ని అదృష్టం వరించింది. భార్యాభర్తలిద్దరూ లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్నారు. అంతే కాదు, తమ అనుచరుడి పే రుతో వేసిన దరఖా స్తును కూడా లిక్కర్ షాపు వరించింది.
వరంగల్ రూరల్ జిల్లా వైన్స్ షాపుల లక్కీ డ్రా ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్‌లో నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ తన పేరుతో పాటు తన భార్య సాంబలక్ష్మి, తన అనుచరుడు ప్రయణ్ పేరుతో దర ఖాస్తు చేశారు. లాటరీలో ముగ్గురి పేర్లతో మూడు షాపులు రావడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలు ఖరారు చేయగా ఆమెకు రెండు షాపులు దక్కించుకున్నది. ఆమెను ఈ సందర్భంగా లక్కీ లేడీ అంటూ అభినందించారు. సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక వ్యక్తి మూడు వైన్ షాపులు దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ సిండికేట్‌గా సంగారెడ్డి పట్టణంలోని మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కడంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.
ప్రభుత్వ పిఇటి ఉపాధ్యాయురాలికి దక్కిన షాపు
మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో ఒక షాపు పుష్ప అనే ప్రభుత్వ పిఇటికి దక్కింది. కలెక్టర్ నిర్వహించిన డ్రాలో భూపని పుష్ప షాపు నెంబర్ 17 ను దక్కించుకున్నారు. భూపని పుష్ప ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లోని రాంనగర్ హైస్కూల్‌లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి షాపుల లైసెన్సుల కోస దరఖాస్తు చేసుకోవడం, షాపును పొందడానికి అనర్హులు. ఈ నేపథ్యంలో తిరిగి సదరు దుకాణానికి అధికారులు డ్రా నిర్వహించనున్నారు.
19 షాపుల డ్రా నిలిపివేత
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రా లో తక్కువగా దరఖాస్తులు వచ్చిన 19 షాపులకు అధికారులు డ్రా తీయకుండా నిలిపివేశారు. శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని మూడు, ఆదిలాబాద్‌లో ఆరు, ఆసిఫాబాద్‌లో ఏడు, భూపాలపల్లిల్లో రెండు, సంగారెడ్డిలో ఒక దఖాణానికి డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రా నిలిపివేసిన 19 మద్యం షాపులకు నేటి నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. ఈ దరఖాస్తులకు నవంబర్ 3న డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు ఆయా కార్యాలయలంల్లో అధికారులు సిద్దంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. గతంలో ఇలాగే 22 షాపులకు డ్రాను వాయిదా వేసి తరువాత నిర్వహించారు.
హైదరాబాద్ జిల్లాల్లో 82 షాపులకు డ్రా
హైదరాబాద్ జిల్లాలో సోమవారం మద్యం షాపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ హరి చందన అన్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండ్ పరిధిలోని 82 మద్యం షాపుల డ్రా అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సికింద్రాబాద్ 97 మద్యం షాపుల డ్రాను కలెక్టర్ హరి చందన చేపట్టారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ లోని 179 మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారా రూ. 185 కోట్లు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
179 షాపులకు ప్రశాంతంగా డ్రా : ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్
హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 179 మద్యం షాపులకు ప్రశాంతంగా డ్రాలు జరిగాయని, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగిందని పేర్కోన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్‌నగర్‌లోని 138 మద్యం షాపులకు, శంషాబాద్‌లోని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మేడ్చల్‌లో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మల్కాజిగిరిలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మద్యం షాపుల డ్రాను నిర్వహించారు. కలెక్టర్లతోపాటు డిప్యూటి కమిషనర్ పి.దశరథ్, ఎక్సైజ్ సూపరిండెంట్ పంచాక్షరీ, ఏఈఎస్‌లు శ్రీనివాస రావు, డిప్యూటి సూపరిండెంట్‌లు నవీన్, ఫచాజోద్దీన్, కృష్ణ ప్రియ, ఉజ్వలరెడ్డిల, స్మిత సౌజన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.