జైపూర్: ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్రాంతంలోని తోడిలో ఇటుక బట్టీకి కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఓవర్ హెడ్ 11,000-వోల్ట్ల విద్యుత్ తీగను తాకింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.
ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మనోహర్‌పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి గాయపడిన వారిని షాపురా ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడి ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించి.. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.