జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల వ్యూహప్రతివ్యూహాలు
టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ అగ్రనేతలు మీనాక్షినటరాజన్, మహేశ్‌గౌడ్, డిప్యూటీ సిఎం భట్టి సహా
పలువురు కీలక నేతల భేటీ
ప్రచార సరళి, ప్రసంగాలపై నేతలకు దిశానిర్దేశం
నేడు నియోజకవర్గంలో బిజెపి మహా పాదయాత్రలు
ప్రచారం మరింత ఉధృతం చేయాలని నిర్ణయం
ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్, మజ్లిస్ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం
వివిధ సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చే పనిలో బిఆర్‌ఎస్ బిజీబిజీ
డివిజన్ల వారీగా ప్రచారం, గ్రూప్ సమావేశాలతో కార్యకర్తల్లో
ఉత్సాహం నింపుతున్న గులాబీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తమ ఖాతా లో వేసుకోవాలని మూడు ప్రధాన పార్టీలై న కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి వ్యూహ, ప్ర తివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. ఇం దులో భాగంగానే సోమవారం కాంగ్రెస్, బిజెపి నేతలు ముఖ్య నేతలు సమావేశమై మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ రా ష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అధ్వర్యంలో సోమాజిగుడాలోని టూరిజం ప్లా జాలో పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టివిక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. ఈ నెలాఖరు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే రోడ్-షో, బహిరంగ సభల నిర్వహణ, కుల సంఘాలతో వేర్వేరు సమావేశాల నిర్వహణ, పాదయాత్రలు, ఇంటింటికి ప్రచారం, ఓటర్ స్లిప్పు ల పంపిణీ, ఓటింగ్‌కు రాలేని వయోవృద్ధులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్ళేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తమ ప్రసంగాల్లో పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అభ్యర్థి విజయం సాధించడం తథ్యమని, అయితే ఘన విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కష్టపడాలని, నేతల మధ్య సమన్వయ లోపం ఉండరాదని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని వారు ఆదేశించారు. ఇదిలాఉండగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సోమవారం తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ప్రచార ఏర్పాట్లపై చర్చించారు.
నేడు బిజెపి మహా పాదయాత్రలు..
మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున నిర్వహిస్తున్న ప్రచారం గురించి ప్రధానంగా చర్చించారు. ఈ ప్రచారం సరిపోవడం లేదని, ఇంకా ఉధృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వ్యూహాలను తిప్పికొడుతూ ముందుకు సాగాలని నిర్ణయించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్-మజ్లీస్ పార్టీల అనుబంధం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆ పార్టీలను ఎండగట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్-మజ్లీస్‌ల బంధాన్ని బయటపెట్టడం ద్వారా బిజెపికి లాభం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయం సాధించడం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్నారు.
కదిలిన గులాబీ దండు..
ఇంకో వైపు బిఆర్‌ఎస్ నేతలు తమ సొంత సీటును కాపాడుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు, మాజీ మంత్రి టి. హరీష్ రావు వేర్వేరు డివిజన్లలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు కెటిఆర్ కారు దిగి ఆటోలో ఎక్కి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్లతో, కుల సంఘాలతో సమావేశమై బిఆర్‌ఎస్ గెలుపొందాల్సిన అవశ్యకత గురించి ఆయన వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన తెలిపారు. హరీష్ రావు కూడా గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. ఇలా మూడు పార్టీలూ తమ అజెండాతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.