బీహార్‌లో 2025 నవంబర్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్రం ఇదే పాలన కొనసాగింపా? మార్పా? అనే చౌరస్తాలో ఉంది. బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎతో నితీశ్ కుమార్ తాజా రాజకీయ కలయిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్ రాజకీయాలకు నాయకత్వం వహిస్తున్న నితీశ్ కుమార్‌కు ఇది పాలనా సంస్కరణలు, సామాజిక ఇంజనీరింగ్, తరచు రాజకీయ పునర్నిర్మాణాల ద్వారా సాగిన ఒక యుగానికి చివరి అధ్యాయం కావచ్చు. 2025 అసెంబ్లీ ఎన్నికలు కేవలం అధికారం కోసం జరిగే మరో పోటీ కాదు. నితీశ్ కుమార్ శాశ్వతమైన, సంక్లిష్టమైన వారసత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు. లాలూ పాలన తర్వాత బీహార్‌లో అపూర్వ మార్పులకు శ్రీకారం చుట్టిన యువత ఆశలు ఆశయాలు, కులపరమైన పునర్వ్యవస్థీకరణల నేపథ్యంలో నితీశ్ మళ్లీ మరోసారి తమ పార్టీని నిలుపుకోగలరా అనే దానికి ఇదో పరీక్ష.
ప్రభుత్వ వ్యతిరేకత, నితిశ్ సామర్థ్యం
నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్లుగా బీహార్‌ను పాలించారు. ఆధునిక బీహార్ రాజకీయాల్లో ఇదో రికార్డు. ఆయన పాలనలో 1990వ నాటి జంగల్ రాజ్ నుంచి రాష్ట్రం సుస్థిరత, మెరుగైన శాంతి భద్రతలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో మారింది. సుదీర్ఘకాలన ప్రభుత్వ వ్యతిరేకతను పెంచింది. ముఖ్యమంత్రి తరచు రాజకీయాల మార్పుల వల్ల -జెడి(యు) బిజెపి నుంచి మహాఘట్‌బంధన్‌కు, తిరిగి ఎన్‌డిఎకు మారడంతో ఆయనకు పాల్తూ రామ్ అన్న మారుపేరు తెచ్చిపెట్టింది. ఇది నితీశ్ ఇమేజ్‌ను, ఓటర్ల విశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. ఆయన రాజకీయ ఊగిసలాటల మధ్య పెరిగిన యువ ఓటర్లకు ఇది అస్థిరతగానే కన్పిస్తుంది. ఎన్‌డిఎలో నితీశ్ తప్పని, ఇష్టంలేని మిత్రుడుగానే కొనసాగుతున్నారు. జాతీయ స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్న బిజెపి ఆయనను ఆస్తిగానే కాదు అనవసరంగా నెత్తికి ఎత్తుకున్న భారంగానే భావిస్తోంది. జెడియు కుల సమతుల్యతను, పాలనపై విశ్వసనీయతను సాధించినా, ఆ పార్టీకి తగ్గుతున్న ప్రజాదరణ నితీశ్ అనంతరం మనుగడపై ప్రశ్నార్థకంగా నిలిచింది. ఇందుకు విరుద్ధంగా ఆర్‌డిఎకి చెందిన తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాఘట్‌బంధన్, నితీశ్‌ను రాజకీయ అవకాశవాదం, పాలనా స్తబ్ధతకు చిహ్నంగా చిత్రీకరిస్తోంది. వారి కొత్తనినాదం ‘నయీ సోచ్, నయీ బీహార్’ యువతలో కొత్త ఆకర్షణ మంత్రం అయింది. యువ, సామాజిక న్యాయం ఆధారిత రాజకీయాలకు ప్రాతినిధ్యంవహిస్తున్న తేజస్వి ప్రభుత్వ వ్యతిరేకతను తరాల మార్పుగా మార్చాలని ఆశిస్తోంది.
బీహార్ రాజకీయ చిత్రంలో తరాల మార్పు
2025లో తొలిసారి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నవారిలో చాలా మంది 2005లో నితిశ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినవారే. ఈ నితీశ్ తరానికి అభివృద్ధి అంటే పాలనా సంస్కరణలు, బాలికలకు సైకిళ్లు, మెరుగైన రోడ్లు కానే కావు. వారి ఆశలు, అంచనాలు వేరేగా ఉన్నాయి. ఈ ఓటర్లలో చాలామంది ఇప్పుడు నిరుద్యోగం, వలస సమస్యలు, వారి ఆకాంక్షలను తీర్చలేని విద్యా వ్యవస్థను ఎదుర్కొంటున్నారు. యువత ఆకాంక్షలను ఓట్లుగా మార్చుకోవడమే తేజస్వియాదవ్ ముందున్న సవాల్. 2020 ఎన్నికల్లో తేజస్వి 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ అసాధ్యమని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, యువతను ఎక్కువ ఆకట్టుకుంది. ఇప్పుడు మరింత జాగ్రత్తగా, ఉద్యోగాలతోపాటు గౌరవంగా జీవించే అవకాశం, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధితో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. సామాజికంగా బీహార్‌లో కులవ్యవస్థ లోతుగాపాతుకుపోయినా, దాని రాజకీయ ప్రాధాన్యతతగ్గింది. ఆర్‌జెడి సాంప్రదాయ ముస్లిం, యాదవ్ పునాది అధికారం అందుకునేందుకు చాల దు. దీంతో తేజస్వి అత్యంత వెనుకబడిన తరగతులు, మహిళలు, తొలిసారి ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. మహాఘట్‌బంధన్ ‘సామాజిక్ న్యాయ్ -2.0’ నిర్మాణానికి సిద్ధమయ్యారు. పేదల ఆకాంక్షలను ఆకట్టుకునే మంత్రం కానున్నది. మరోపక్క నితీశ్ కుమార్ మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహా దళితులలో పెంచుకున్న మద్దతుపై ఆధారపడి కొనసాగుతున్నారు. ఆయన ప్రభుత్వం చేపట్టిన ‘జీవిక’ నుంచి ‘ఘర్ ఘర్ నల్ జల్’ వరకూ సంక్షేమ పథకాలు బలమైన, విచ్ఛిన్నమైన పునాదిని సృష్టించాయని భావిస్తున్నారు. జెడి(యు) నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాశ్, సబ్ కా విశ్వాస్’ బిజెపి జాతీయ సందేశాన్ని ప్రతిధ్వనిస్తోంది. అయితే నితీశ్ కుమార్ వ్యక్తిగత ప్రచారం ఇప్పటికీ గ్రామీణ బీహార్ లో బలంగా ధ్వనిస్తోంది. భద్రత, సాధికారికత పట్ల మహిళలు ఎంతో నమ్మకంతో ఉన్నారు.
అభివృద్ధి, సామాజిక న్యాయం పోటాపోటీ
అభివృద్ధి, సామాజిక న్యాయం విషయంలో రెండు కూటముల మధ్య ప్రధాన సైద్ధాంతిక అంతరం ఇప్పటికీ ఉంది. జెడి(యు), -బిజెపి కలయికను డబుల్ ఇంజిన్ సర్కార్‌గా చూపుకుంటోంది. మౌలిక సదుపాయాలు, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు తాము కొనసాగాలని కోరుకుంటోంది. రోడ్లు, విద్యుత్, నల్లాల ద్వారా నీళ్లు, మహిళా సంక్షేమం, నితీశ్ సుపరిపాలన రికార్డుపై ఎన్‌డిఎ దృష్టి పెడుతోంది. పట్టణ, సెమీఅర్బన్ ప్రాంతాలలో ప్రధాని నరేంద్ర మోడీకి గల ఆదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇందుకు విరుద్ధంగా మహాఘట్‌బంధన్ సామాజిక న్యాయాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుంది.ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షాల కూటమి – నిరుద్యోగం, విద్య, కులగణన, అసమానతలనే హైలైట్ చేస్తోంది. 20 ఏళ్ల నితీశ్ పాలనలో ఎవరు ప్రయోజనం పొందారు? ఎవరు వెనుకబడ్డారని నిలదీస్తోంది? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2023 లో కులసర్వేను సమర్థించడం ద్వారా నితీశ్ ముందుగానే దీనిని కొంతమేరకు సాధించారు. బిజెపితో పొత్తు ఉన్నా, వెనుకబడిన తరగతులను లెక్కించడం ద్వారా సామాజిక న్యాయ ప్రమాణాలను నిలుపుకున్నారు. అయితే, ఆర్థిక పరమైన ఆందోళనల నేపథ్యంలో అది ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.
అధికార యంత్రాంగం, నితీశ్ కుమార్ టీమ్
నితీశ్ కుమార్ బలం ఆయన సర్కార్‌లో సమర్థులైన అధికారులు. వీరిలో చాలా మంది దశాబ్దాలుగా సిఎంతో కలిసి పని చేశారు. దీపక్ కుమార్, ప్రత్యయ అమృత్, సంజయ్ కుమార్ ఝా, అనుపమ్ కుమార్, విజయ్ చౌదరి వంటి వారు ఆయన పాలనలో కీలకపాత్ర వహించారు. ఈ టీం కొనసాగింపును, సామర్థ్యాన్ని నిర్ధారిస్తూనే, నితీశ్ పాలన ప్రజల రాజకీయ నాడిని పట్టుకోలేకపోతున్నదని విమర్శకులు వాదిస్తున్నారు. సాంకేతిక, డేటా ఆధారంగా సాగుతున్న పాలనపై విమర్శలు లేకపోలేదు. బీహార్ రాజకీయ వాతావరణం, వ్యక్తిత్వం మీద ఆధారపడిన నితీశ్ మోడల్ అధికారుల పాలనకు పరీక్ష ఎదుర్కొంటోంది. ఇందుకు విరుద్ధంగా తేజస్వి ప్రచారం ప్రజలపై కేంద్రీకృతమై, డిజిటల్ విస్తరణపై ఆధారపడి ఉంది.
ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సర్వే
2025 ప్రారంభంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఫలితంగా ఓటర్ల జాబితానుంచి 69లక్షల ఓటర్ల పేర్లు తొలగించింది. దీనిని ఎన్నికల కమిషన్ ఓటర్ల శుద్ధి ప్రక్రియగా పేర్కొన్నా, రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. మహాఘట్‌బంధన్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. ముఖ్యం గా వలస, పేద బలహీనవర్గాల ఓటర్లపై కోత పడిందని అనేక పార్టీలు ఆరోపించాయి. ఈ పరిణామంతో పోలింగ్ శాతం అంచనాలపై అనిశ్చితి నెలకొంది. 2020లో బీహార్ లో 57 శాతం ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. నితీశ్ కు దశాబ్దాలుగా కలసివస్తున్న అంశంఇదే. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా మధ్యతరగతి, గ్రామీణులను ఎన్‌డిఎకు దూరం చేస్తున్నందువల్ల మహిళలు 2025 లో నితీశ్‌కు ఏమాత్రం ప్రయోజనం చేకూరుస్తారో చూడాలి. ఎన్‌డిఎకు మరో తలనొప్పి చిన్న పార్టీలు, మాజీ ఎంపి పప్పుయాదవ్ పార్టీ, జన్ సూరజ్ పార్టీల కొత్త రాజకీయ ఫ్రంట్. ఈ కూటమి ఓట్లు చీల్చడంలో కీలక భూమిక నిర్వహించవచ్చు.
కూటమి లెక్కలు, అంతర్గత వైరుధ్యాలు
ఎన్‌డిఎలో బిజెపి బీహార్‌లో స్వతంత్రంగా ఎదగాలన్న ఆశయానికి నితీశ్ నుంచి బ్రేక్ తప్పడం లేదు. 2020లో సీట్ల పంపకాల చర్చల్లోనే కీచులాటలు వచ్చాయి. 2024లో లోక్‌సభ విజయం నేపథ్యంలో బిజెపి సింహభాగాన్ని కోరుతోంది. 2010 తర్వాత జెడియుకి తగ్గుతున్న సీట్ల సంఖ్య, ఎన్నికల్లో పేలవ ప్రదర్శన నితీశ్ పార్టీని జూనియర్ పార్ట్ నర్ చేయవచ్చు. మరో పక్క మహాఘట్‌బంధన్‌లో లుకలుకలు ఎక్కువే. ఆర్‌జెడి పెద్దన్న పాత్ర వల్ల కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ తక్కువ సీట్లకే పరిమితమవుతున్నాయి. అయితే నిరుద్యోగం, రిజర్వేషన్లు, కుల న్యాయం వంటి అంశాలు వాటి ఐక్యతను నిలబెడుతున్నాయి. ఏదిఏమైనా 2025 బీహార్ ఎన్నికలు అత్యంత పోటా పోటీగా సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌డిఎకు అనుకూల అంశం- కేంద్ర ప్రభుత్వం దూరదృష్టి, మోడీ ఆకర్షణ, మహిళలు, వృద్ధ ఓటర్లలో నితీశ్ కుమార్‌పై ఉన్న విశ్వసనీయత. అదే జెడియు- బిజెపి కూటమికి ప్రయోజనం చేకూర్చే వీలున్నది. మహాఘట్‌బంధన్ బలం- ప్రభుత్వ వ్యతిరేకత, తేజస్వియాదవ్‌కు అట్టడుగు వర్గాలలో ఉన్న బలం, యువత ఉపాధిపై చేస్తున్న ప్రచారం అనుకూల అంశాలు. జెఎస్ పి వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, పప్పుయాదవ్ ప్రభావం తక్కువే అయినా, సీమాంచల్, మిథిలాంచల్‌లో కీలక పార్టీల ఓట్లను చీల్చవచ్చు. ఆధిక్యతను దెబ్బతీయవచ్చు. ఈ పరిణామాల కారణంగా హంగ్ ఏర్పడే ఛాన్స్ లేకపోలేదు. కీలక పార్టీలు కింగ్ మేకర్ పాత్ర వహించినా ఆశ్చర్యం లేదు.
నితీషిజం -చరమ గీతం పాడేనా?
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా 2025 ఎన్నికలు నితీషిజం భవిష్యత్‌కు కొత్త నిర్వచనం ఇస్తాయి. నితీశ్ విజయం సాధిస్తే, గందరగోళం కొనసాగుతుంది. ఆయన తడబడితే, తేజస్వి యాదవ్ వంటి కొత్త తరానికి అధికారం పగ్గాలు అందుతాయి.
– గీతార్థపాఠక్ ( ఈశాన్యోపనిషత్)
– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు