దివ్యాంగుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. బిజెపి దివ్యాంగుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వర్ రావు అధ్వర్యంలో మంగళవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాంచందర్ రావు ప్రసంగిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. వారికి లభిస్తున్న పెన్షన్‌ను నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
ఆధునిక ఉపకరణాల పంపిణీ, ప్రత్యేక ఉపాధి కోటా వంటి హామలు గాలిలో కలిసాయని దివ్యాంగులు ఆందోళనతో ఉన్నారని ఆయన తెలిపారు. దివ్యాంగులకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని రాంచందర్ రావు వివరించారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురిచి వివరించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, హియరింగ్ ఎయిడ్ల వంటి ఆధునిక ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దివ్యాంగులు బిజెపి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని రాంచందర్ రావు కోరారు.