8 నుంచి 12శాతం తేమ వరకే సిసిఐ అనుమతి
ఈ ఏడాది నిబంధనలు కఠినతరం
అకాల వర్షాలతో పత్తిలో అధిక తేమ
లబోదిబోమంటున్న రైతులు
తేమ శాతాన్ని 17 నుంచి 18శాతం వరకు సడలించాలని డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి పండిచిన పత్తి పంట తీరా విక్రయించే సమయానికి తేమ కొర్రీలతో మద్దతు ధర లభించేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రధమార్థంలోనే ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లు పలు కారణాలతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయితే ఆలస్యంగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడం, మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో తేమ శాతం అధికంగా ఉంటోంది. ప్రస్తుతం సిసిఐ కేంద్రాలకు విక్రయించేందుకు తీసుకొస్తున్న పత్తి అధిక తేమ శాతం ఉంటుంది. సిసిఐ మాత్రం 8 నుండి 12 శాతం తేమ వరకు మాత్రమే అనుమతిస్తోంది. దీంతో పత్తి రైతులకు దక్కాల్సిన మద్దతు ధర ప్రశ్నార్థ్దకంగా మారింది.
రా ష్ట్రంలో ఈ ఏడాది 43.29 లక్షల ఎకరాల్లో 24.70 లక్షల టన్నులు పత్తి దిగుమత్తి అ వుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో మొత్తం పత్తిలో 70 శాతం మద్దతు ధరలకు కొనుగోలు చేస్తున్నట్లు సిసిఐ వెల్లడిస్తోంది. అ యితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సిసిఐ నిబంధనల ప్రకారం తేమ శాతం రైతుల మద్దతు ధరకు అశనిపాతంలా మారింది. ఏటా పత్తి కొనుగోళ్లకు సిసిఐ తేమ విషయంలో నిబంధనలు జారీ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు వాటిని సడలిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తేమ నిబంధనలు సడలించాలని వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రానికి వరుస విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ విజ్ఞప్తులు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి.
కాగా, రాష్ట్రానికి తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా దళారులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుని వచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు రైతులకు ఇబ్బంది కరంగా మారింది. ఈ యాప్‌లో నమోదు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్య రైతులను వేధిస్తోంది. పత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర అధికారి సోమవారం ఆదిలాబాద్‌లో సందర్శించి కొనుగోళ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తేమ శాతంపై ఎదుర్కోంటున్న సమస్యలు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణ పరిస్థితుల్లో తేమ శాతం 16 వరకు వస్తోందని రైతులు వాపోతున్నారు. తేమ శాతం నిబంధన 17 నుండి 18 శాతం వరకు సడలిస్తే మద్దతు ధర లభిస్తుందని రైతుల పేర్కొంటున్నారు.
సిసిఐ నిబంధనలు ఇలా
సిసిఐ ఈ ఏడాది పత్తి కొనుగోలకు నిబంధనలు కఠినతరం చేసింది. పత్తిలో తేమ శాతం 8 నుండి 12 శాతం వరకు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అధికంగా ఉంటే కొనుగోలు చేయమని తేల్చిచెప్పింది. 8 శాతం కంటే తక్కువగా తేమ ఉంటే ప్రోత్సాహకాలు అందిస్తామని, 8 శాతం నుండి 12 శాతం మధ్య తేమ ఉంటే ధర నిష్పత్తి ప్రకారం తగ్గుతుందని తెలిపింది.