న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కోటి పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8 వ వేతనకమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7 వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8 వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు,
మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. అనంతరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , 65 లక్షల మంది పింఛనుదారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంతమేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది.
యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ పెంపు
ప్రస్తుత 202526 రబీ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం యూరియాయేతర సబ్సిడీని రూ. 37,952 కోట్ల వరకు పెంచింది. ఫాస్ఫరస్ (పి), సల్ఫర్ (ఎస్) ఎరువులపై ఈ సబ్సిడీ వర్తిస్తుంది. వ్యవసాయ సమాజానికి ఇది పెద్ద ఊరట. అయితే నైట్రొజన్ (ఎన్), పొటాష్ (కె) సబ్సిడీల్లో ఎలాంటి మార్పులేదు. ఈ ధరలు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయాలు తీసుకుంది. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఫాస్ఫేట్ కిలో ఒక్కింటికి రూ. 43.60 వరకు ఉండగా, ఈ రబీ సీజన్‌లో రూ.47.96 వరకు సబ్సిడీ పెరిగింది. అదే విధంగా ఖరీఫ్‌లో సల్ఫర్‌కు కిలో రూ. 1.77 వంతున సబ్సిడీ ఉండగా, ఇప్పుడు రబీలో రూ. 2.87 వంతున పెరిగింది. నైట్రొజన్, పొటాష్ సబ్సిడీల్లో ఎలాంటి మార్పు లేదు.
అవి క్రమంగా కిలోకు రూ. 43.02, రూ.2.38 వంతున కొనసాగుతున్నాయి. 2024 రబీ సీజన్ కన్నా 2025 రబీ సీజన్‌లోసబ్సిడీ ఆమోదం రూ. 14,000 కోట్ల వరకు ఎక్కువని మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. ఎంఆర్‌పి పెంచకుండా రైతులకు డై అమోనియం ఫాస్ఫేట్ (డిఎపి), ట్రిపిల్ సూపర్ ఫాస్ఫేట్ (టిఎస్‌పి) అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ కల్పించిందన్నారు. గతం కన్నా ఫాస్ఫరస్, సల్ఫర్ ధరలు 10 శాతం పెరిగాయన్నారు. డిఎపి, టిఎస్‌పి ఎక్కువగా వినియోగమయ్యే ఎరువులని, అందువల్ల సబ్సిడీ రేటు పెంచడం వల్ల రబీ సీజన్‌లో రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ ఎరువుల ధరలు రిటైల్‌గా పెరగకుండా ప్రభుత్వం భారం వహిస్తుందని తెలిపారు.