తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో-ఇంజిన్‘ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర ‘రోడ్ మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు. ‘టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్’, ‘సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్‘ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ‘ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్‘ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంగళవారం హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. గ్లోబల్ ‘ఏరోస్పేస్-డిఫెన్స్ – స్పేస్’ హబ్ గా తెలంగాణ ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని, ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్ నగరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023 -24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024- 25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే రూ. 30,742 కోట్లకు పెరిగాయన్నారు.
ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదని, తమ ప్రభుత్వ హయాంలో ఈ రంగం సాధించిన వృద్ధి రేటుకు నిదర్శనమన్నారు.ఈ ‘న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ’ లో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్) తయారవుతాయన్నారు. ఫలితంగా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విమాన ప్రయాణ భవిష్యత్తును నిర్మించాలనుకుంటే – దానిని తెలంగాణలో నిర్మించాలని ఈ వేదికగా అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, ఎమ్మార్వో, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో టాటా అడ్వానస్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్, ఈడీ మసూద్ హుస్సేన్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.