బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో వానలు దంచికొడుతున్నాయి. ఇక, విశాఖపట్నంలో కురుస్తున్న కుండపోత వానలకు రోడ్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు రైళ్లు, విమానాలను రద్దు చేశారు. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇక, కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను రద్దు చేయగా.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు కూడా రద్దు చేశారు.