ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు, మరో యువకుడితో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ముప్పాళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో పాటు విజయవాడకు చెందిన మరో యువకుడు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది. బాలిక శరీరంలో నిందితులు కొరికిన గాయాలు ఉన్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలిని ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందిస్తున్నారు. తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వేగంగా స్పందించారు.
మైనర్ బాలిక కావడంతో పోలీసులు పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు కావాలనే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాల్గవ నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. తాము పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించి నలుగురు యువకులు తన కూతురిపై పశు వులా ప్రవర్తించారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చి చూడగా చాలా మంది అక్కడ ఉన్నారని, లోపలికి వెళ్లి చూడగా కూతురు భయపడుతూ గాయాలతో కనిపించిందన్నారు. కింద పడి దెబ్బలు తగిలాయని చెప్పే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురి శరీరంపై గాయాలు చూస్తే ఎంతగానో వేధించారని తెలుస్తుందని, నిందితులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం చేయాలని ఆమె మేనమామ డిమాండ్ చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొన్ని గంటల తరువాత డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారని వెల్లడించారు.