న్యూఢిల్లీ: 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వేళ రాష్ట్రీయ జనతాదళ్ (RJD).. పలువురు నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై ఆర్జేడీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వీరిని ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించింది. ఎన్నికల్లో పలువురు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు, వివిధ నియోజకవర్గాలలో RJD అధికారిక అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ వేటు వేసినట్లు తెలుస్తోంది.
పార్టీ నుంచి బహిష్కరించబడిన వారిలో పర్సా ఎమ్మెల్యే చోటేలాల్ రాయ్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రీతు జైస్వాల్, ఎమ్మెల్యేలు మొహమ్మద్ కమ్రాన్, మాజీ ఎమ్మెల్యేలు రామ్ ప్రకాష్ మహతో, అనిల్ సాహ్ని, సరోజ్ యాదవ్, అనిల్ యాదవ్ ఉన్నారు కాగా, రీతు జైస్వాల్ పరిహార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ఆర్జేడీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పుర్వే కోడలు స్మితా పుర్వేను నిలబెట్టింది. అదేవిధంగా, నవాడలోని గోవింద్ పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొహమ్మద్ కమ్రాన్, అధికారిక ఆర్జేడీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ భార్య పూర్ణిమా యాదవ్ పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.