కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకుంది. ఇప్పుడు ఆతిథ్య జట్టుతో టి-20 సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియాలు 32 టి-20ల్లో తలపడగా.. 20 మ్యాచుల్లో భారత్, 11 మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో భారత్‌ను ఈ సిరీస్‌లో ఎదురుకొనేందుకు ఆసీస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు.
కాన్‌బెర్రా వేదికగా బుధవావరం (అక్టోబర్ 29) జరిగే తొలి టి-20కి ముందు మార్ష్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అభిషేక్ శఱ్మ అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఐపిఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున చక్కగా ఆడాడు. నిజంగా అతడు మాకో ఛాలెంజ్. కానీ, మేం అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’’ అని అన్నాడు. అలాగే జోష్ ఇంగ్లిస్ ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌కి ఇంగ్లిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. కానీ, ఇప్పుడు అతడు ఫిట్‌నెస్ సాధించాడని తెలిపాడు. ‘‘జోష్ ఇంగ్లిస్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అతడు మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు’’ అని మార్ష్ వివరించాడు.