నిజాంకు సవాల్‌గా నిలిచిన కొమురం భీమ్
‘మన్‌కీ బాత్’లో కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/హైదరాబాద్: ఆదివాసీల పోరాటయోధుడైన కొమురం భీమ్ సేవలు అమోఘమైనవని ప్రధాని నరేంద్ర మోడి కొనియాడారు. ప్రతి నెలా నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 12 7 వ కార్యక్రమంలో ప్రధాని మోడి ప్రసంగించారు. ప్రధాని తన ప్రసంగంలో కొమురం భీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌ను దోచుకోవడానికి బ్రిటీష్ పాలకులు అన్ని మార్గాలూ ఉపయోగించారని ఆయన తెలిపారు. ఆ సమయంలో బ్రిటీష్ పాలకులు నిజాం పాలనను బలపరిచారని అన్నారు. పేదలు, గిరిజనులపై నాడు జరిగిన వేధింపులు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల భూములను నిజాం పాలకులు లాక్కున్నారని ఆయన విమర్శించారు. అటువంటి కష్టకాల సమయంలో ఇరవై ఏళ్ళ యువకుడు ఆ అన్యాయాలను ఎదురొడ్డి నిలిచారని ప్రధాని వివరించారు. ఆ కుర్రాడి గురించి తెలియని వారంతా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ రోజుల్లో నిజాం గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడేందుకూ అవకాశం లేదని, అలా ఎవరైనా మాట్లాడితే నేరం అయ్యేదని ఆయన తెలిపారు. ఆ కుర్రాడే నిజాం అధికారి సిద్దిఖీని బహిరంగంగా సవాల్ చేశారని, చివరకు మట్టుబెట్టారని ఆయన తెలిపారు. ఆ కుర్రాడి వీరత్వం గురించి తెలుసుకున్న బ్రిటిషర్లు మట్టుపెట్టాలని ప్రయత్నించగా, తప్పించుకుని అసొం చేరుకున్నారని. ఆ కుర్రాడే కుమురం భీమ్ అని ప్రధాని మోదీ చెప్పారు.
సైనికులు హత్య చేశారు
1940లో నిజాం సైనికులు కొమురం భీమ్‌ను హత్య చేశారని ఆయన తెలిపారు. నిజాంకు చాలా కాలం సవాల్‌గా నిలిచిన కొమురం భీమ్ నలభై ఏళ్ళు బ్రతికారని ఆయన చెప్పారు. ఆదివాసీల పోరాట యోధుడైన కొమురం భీమ్ ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఆయన తెలిపారు. కొమురం భీమ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన చెప్పారు. సంస్కృత భాష, వందేమాతరం, కాఫీ ఉత్పత్తులు, సర్దార్ పటేల్ జయంతి గురించి కూడా ప్రధాని మోదీ సుదీర్ఘంగా వివరించారు. ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోడి మనక్ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వీక్షించారు. ఇదేవిధంగా జిల్లాల్లోనూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ వీక్షించారు.