మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో బిఎస్‌సి (హానర్స్) అగ్రికల్చర్ కోర్సు లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 29 ఆఖరు తేదీ అని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజెపీ ద్వారా నిర్వహిస్తున్న ఈ కోర్సులో ప్రవేశం కోసం ఈనెల 21 నుంచి దరఖాస్తులు https://ug.mjptbcwreis.net ద్వారా తీసుకుంటున్నామని ఆయన నేడొక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్‌మీడియట్ (బిపిసి గ్రూప్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ టిజి ఈఎపిసెట్ -2025 పరీక్షలో అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల విద్యార్థినీ విద్యార్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల కోసం https://ug.mjptbcwreis.net లేదా https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలన్నారు. దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదని ఆయన తెలిపారు.
ఈనెల 29వ తేదీ లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు రుసుము రూ. 1,000/- ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని, అవసరమైన అన్ని ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపిక టిజి ఈఎరపిసిఈటి -2025 ర్యాంకుల ఆధారంగా జరుగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆఫీస్ పని దినాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 040-23328266 నంబరులో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని లేదా mjpadmissioncell@gmail.com కు మెయిల్ పంపించాలని ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.