విశేషమైన రచనాసామర్ధ్యం కలిగిన కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ పొందటం చూసి సంతోషపడుతున్న ఆమె వేలాది మంది అభిమానుల్లో నేనూ ఒకరిని. 2016లో ఆమె పుస్తకం ‘హ్యూమన్ యాక్ట్’ యూకేలో ఇంగ్లీష్‌లో ప్రచురించినప్పుడు ఒక ప్రసిద్ధ కవి, అనువాదకులు నాకు ఓ ఉత్తరం రాస్తూ ‘ప్రపంచ సాహిత్యంలో ఈ పుస్తకం విశేషం. ప్రజల మీద రాజకీయోద్దేశ్యాలతో జరిగే అకృత్యాల గురించి ఒక విన్నూత్నమైన తరహాలో రాసిన పుస్తకం. మనిషి బతుకు గురించి మనకున్న అవగాహనను విస్తృతం చేసే పుస్తకం’ అంటూ ముక్తాయించారు.
‘ది వెజిటేరియన్’ హాన్ కాంగ్ రాసిన పుస్తకాలలో సుప్రసిద్ధం. అందుకు కారణం 2016లో ఈ నవలకు 2016లో వచ్చిన మాన్ బుకర్ బహుమతి. అనువాద రచనలకు రచయితతో బాటూ అనువాదకులు గూడా బహుమతి ఇచ్చే సంప్రదాయాన్ని ఆ ఏటే బుకర్ ప్రవేశపెట్టింది. వెజిటేరియన్‌తో పాటూ హాన్ కాంగ్ రాసిన ‘హ్యూమన్ యాక్ట్’ నవల అనువాదం కూడా ఆ ఏడే పోటీలో ఉండింది. ఒక జాతి, ఏళ్ళ తరబడి అనుభవించిన అణచివేతనూ, వేదననూ కథాంశంగా తీసుకుని రాసిన ‘హ్యూమన్ యాక్ట్’కు సాధారణంగా ఇలాంటి పోటీల్లో బహుమతి పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని నేననుకున్నాను. ‘వెజిటేరియన్’ ఎంపిక అవ్వడం చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాను. అప్పుడే కొత్తగా ప్రచురించిన ‘హ్యూమన్ యాక్ట్’ రచయితగా హాన్ కాంగ్ పరిణితిని తెలియచెప్తుందని, ఆమె అత్యుత్తమ రచన అని నాలాగే చాలామంది పాఠకులు భావించారు. హ్యూమన్ యాక్ట్ బదులు వెజిటేరియన్‌కు బహుమతి రావడం అన్యాయం అనిపించింది. (చాలామంది ఈ మధ్యే 2025లో వచ్చిన ‘వి డు నాట్ పార్ట్’ ఆమె పుస్తకాల్లోకెల్లా గొప్ప నవలని అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏవాన్, పైజ్ అనియా మోరిస్ ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు)
‘హ్యూమన్ యాక్ట్’, ‘ది వెజిటేరియన్’ నేనే అనువాదం చేశాను. ఆ పుస్తకాలను ఆ తరవాతి కాలంలో మళ్ళీ చదవలేదు. వెజిటేరియన్‌కు బుకర్ బహుమతి వచ్చినప్పుడు నా అనువాదం మీద పత్రికల్లో విమర్శలు వచ్చాయి. తప్పులున్నాయని, అవన్నీ అనుభవరాహిత్యం వల్ల కాక, మూల రచన మీద గౌరవం, ఇష్టం లేకపోవటం వల్లననీ ఒక పక్క ప్రచారం అయ్యింది. (తెర వెనుక నా వ్యక్తిత్వం మీద జరిగిన తీవ్రమైన దాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టింది.) ఇంకోపక్క హాన్ కాంగ్ అద్భుత రచనా సౌందర్యం కంటే నా అనువాదం గొప్పతనం గురించి అనవసరమైన ప్రచారం జరిగింది. ఆ నవల తొందరగా ప్రచురణకు నోచుకోవడం, బహుమతి వచ్చినప్పుడు అనువాదానికి అవసరానికి మించిన పొగడ్తలు లభించడం నేను తెల్ల జాతికి చెందిన దాన్ని కావడం వల్ల అని తెలుసుకుని సాహితీ ప్రపంచంలో ఉన్న జాతి వివక్షను చూసి ఇబ్బంది పడ్డాను. అలానే ఆడవారి పట్ల ఉండే వివక్ష కూడా అర్థం అయ్యింది. ఈ రెండు విషయాల గురించి ఒకేసారి ఎలా ప్రస్తావించాలో అప్పట్లో తెలియలేదు. వేరే అనువాదకులు పని చేసిన ‘ది వైట్ బుక్’ అనే హాన్ కాంగ్ నవలలో నాకు తెలిసి తప్పులేం లేవు. అందులో చిన్న పాప చనిపోయిన సంఘటన గురించి ప్రస్తావన ఉంది కాబట్టి తల్లినైన తర్వాత మళ్ళీ చదవలేక పోయాను. నిన్ననే ఆ అనువాదకులే పని చేసిన ‘వి డు నాట్ పార్ట్’ ఇంగ్లీష్ అనువాదం తీసుకుని చదివాను. నేను హాన్ కాంగ్‌ను మొదట్లో కొరియన్ కొరియన్లో చదివినప్పుడు ఆమె రచనా శైలి, స్వరం నాకు ఎలా తోచిందో ఈ నవల చదివినప్పుడు కూడా అదే అనిపించింది. అంటే నా అనువాదం కూడా సరిగ్గానే ఉన్నట్టు!
అసలు నేను అనువాదకురాలిని ఎందుకు అయ్యానన్న విషయం ఇన్నేళ్ళలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. మాతృ భాషలో రాసేటప్పుడు మా త్రమే నేను సాధించగల స్పష్టత, ఖచ్చితత్వం నేను చాలా పవిత్రంగా భావిస్తాను. భాషలో ప్రత్యేకంగా కనపడే శబ్ద సౌందర్యం, పలుకుబడి నేను చేసే పనిని అర్థవంతంగా మార్చి గొప్ప సంతృప్తిని, ఆ నందాన్ని ఇస్తాయి. అసింటోటి (Asymptote) ప త్రికకు నేను రాసిన ఒక వ్యాసంలో హాన్ కాంగ్‌ను చదువుతున్నప్పుడు, అనువదిస్తున్నప్పుడు (నా దృ ష్టిలో ఈ ప్రక్రియలను ఒకదాన్నించి ఇంకోటి విడదీయడం అసాధ్యం) ఎక్కువ వివరం, వర్ణన లేక పోయినా కళ్ళకు కట్టినట్టుగా, పదాల నుంచి లేచి, ఎదురొచ్చి నిలబడే అద్భుతమైన చిత్రాలను చూస్తున్నట్టు ఉంటుందని ప్రస్తావించాను. ఆమెను చదువుతూంటే భాషకు స్పష్టమైన రంగు రుచి బరువు ఉన్నట్టు, పదాలు ఎక్కడో మూల దాగిన భావాలను, అనుభూతులను తట్టి లేపుతున్నట్టనిపిస్తుందంటూ రాశాను.
(చివరి భాగం వచ్చే వారం)
– హర్షణీయం బృందం