గతంలో కాంగ్రెస్ హయాంలోనే పరిశ్రమలు ఏర్పాటు
‘జూబ్లీహిల్స్’ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించండి
ప్రచారంలో మంత్రి సీతక్క వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: ‘హస్తం’ గుర్తుతోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని, ఇంకా చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణ కాంత్ పార్క్ లో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషిని ఓటర్లకి గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. పిల్లల ఎదుగుదలలో తల్లి పడే తపన, తండ్రి పడే కష్టం ఎంత ఉంటుందో హైదరాబాద్ ఎదుగుదలలో కాంగ్రెస్ కష్టం కూడా అంతే ఉందని పేర్కొన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనూ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను నెహ్రు, ఇందిరా గాంధీ ఏర్పాటు చేశారని అన్నారు.
హైదరాబాద్‌లో వందలాంది ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధంగా వేలాది కంపెనీలు, లక్షలాది ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ కృషి ఫలితమేనని మంత్రి సీతక్క అన్నారు. చిన్న, మధ్య తరహ పరిశ్రమ జాతీయ పరిశోధనా శిక్షణ సంస్థ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో ఉందని చెప్పారు. 1960లో తొలి ప్రధాని ఇక్కడ ఏరి కోరి ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్ల మన చుట్టు పక్కల వేలాది చిన్న మధ్య తరహ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనే 1960లో తొలి ప్రధాని నెహ్రు ఇక్కడ ఏర్పాటు చేశారని తెలిపారు.
అప్పట్లో దేశంలో ఎక్కువగా కరెంటు లేదని, అయితే ఇంటింటికి విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పంతో నెహ్రు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించారని వివరించారు. దీంతో దేశ మంతా వెలుగులు నిండాయని, ఇప్పుడు మన రేవంత్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని చెప్పారు.
మంత్రి సీతక్క వెంట ఎమ్మెల్యే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కృష్ణ కాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ప్రచారం చేశారు. స్థానిక వీధి వ్యాపారులతో మంత్రి సీతక్క ముచ్చటించారు. ఆప్యాయంగా పలకరించి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. వీధి వ్యాపారులు, వాకర్స్ విజ్ఞప్తి మేరకు సరదాగా కాసేపు టీ, పూలు విక్రయించారు.