హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితాలు అధ్వానంగా మారాయని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తున్నారని, లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నారని, కానీ ఆటో డ్రైవర్లకు ఇవ్వడానికి నెలకు వెయ్యి రూపాయలు లేవా? అని సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వారికి మద్దతుగా ఆటోలో హరీష్ ప్రయాణించడం జరిగింది. అనంతరం ఆటో డ్రైవర్లకు మద్దతుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 161 మంది ఆటో కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తప్పకుండా ఆటో డ్రైవర్లను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ యాక్టింగ్ చేశారని, ఇదే యూసఫ్ గూడా జూబ్లీహిల్స్ లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆటోనగర్ అసలే లేదని విమర్శలు గుప్పించారు. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా 10 లక్షల పెంచుతామని పత్తా లేకుండా పోయారని, ఇస్తామన్న 12 వేల రూపాయలకి దిక్కు లేదని మండిపడ్డారు.