ఛండీగఢ్: పెళ్లికి ముందురోజు డ్యాన్స్ చూస్తూ పెళ్లి కూతురు మృతి చెందింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్గారి గ్రామంలో పూజ అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివసిస్తోంది. పక్క గ్రామంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువకుడు దుబాయ్‌లో ఉండడంతో వీడియోకాల్ సహాయంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 24న పెళ్లి చేయాలని ఇరు వైపుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం యువకుడు కూడా దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. అక్టోబర్ 23న రాత్రి సమయంలో అమ్మాయి ఇంట్లో జాగరణ్ వేడుక నిర్వహించారు. ఇంట్లో అందరితో కలిసి పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేసింది. బాంగ్రా నృత్యం చేస్తుండగా ఆమె ముక్కులో నుంచి రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.