నవీ ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన యువ ఓపెనర్ ప్రతీక రావల్ గాయానికి గురైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రతీక గాయం బారిన పడింది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో ప్రతీక వరల్డ్‌కప్‌లోని మిగిలిన మ్యాచ్‌ల నుంచి వైదొలిగిందని తెలిసింది. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
బంగ్లా మ్యాచ్‌లో కూడా ప్రతీక బ్యాటింగ్‌కు దిగలేదు.ప్రతీక స్థానంలో అమన్‌జోత్ కౌర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కివీస్‌పై చిరస్మరణీయ సెంచరీని సాధించి పెను ప్రకంపనలు సృష్టించిన రావల్ సేవలు కోల్పోవడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో ప్రతీక రావల్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తోంది. ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఇలాంటి స్థితిలో రావల్ జట్టుకు దూరం కావడంతో టీమిండియా కష్టాలు మరింత పెరిగాయనే చెప్పాలి.