కాంగ్రెస్ మోసానికి గుణపాఠం చెప్పాలంటే ఆటోడ్రైవర్లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే కనీసం రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చి, ఆటో కార్మికులకు ఇస్తానన్న హామీలు నెరవేరుస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఆటోల్లో ప్రయాణించి డ్రైవర్లతో ముచ్చటించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హరీష్ రావు కోకాపేట నుంచి ఎర్రగడ్డకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆయన ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌కి వచ్చి సినిమా యాక్టర్లకంటే ఎక్కువ నట్టించారని ఎద్దేవా చేశారు. ఆరోజు రాహుల్ గాంధీ హైదరాబాదుకు వచ్చి ఇదే యూసఫ్‌గూడా జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.12 వేలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. వెంటనే బాకీ పడ్డ రూ.24 వేలు ప్రతి ఆటో డ్రైవర్‌కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆటో కార్మికులకు రెండు సంవత్సరాల బాకీ చెల్లించినా రూ.1500 కోట్లు అవుతుందని అన్నారు. 3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై 3 వేల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయని, అందులో నుంచి 1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని తమ డిమాండ్ అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారని, ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గురువు ఆంధ్ర ప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.