కొన్నిచోట్ల ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం వర్తించదు
మంత్రుల పంచాయితీ ముగిసిన అధ్యాయం
హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో హైకమాండ్‌కు ప్రతిదీ తెలుసు
మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడాల్సింది కాదు
కెటిఆర్, హరీశ్‌రావులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది
కెసిఆర్‌ను గౌరవిస్తాం కానీ..రాష్ట్రాన్ని దివాళా తీయించారు
పదేళ్లలో కవితకు అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా?
మెట్రో రెండోదశకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే అడ్డంకి
ఢిల్లీలో మీడియాతో పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇష్టాగోష్టి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఎమ్మెల్యేల్లో కొందరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశం ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రుల పంచాయితీ ముగిసిందని ఆయన తెలిపారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయంలో ఏఐసిసి అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ సాధ్యమైనంత త్వరలో పూర్తి అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే అధ్యక్ష పదవిని కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలూ ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంలో తప్పేమి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి జోడు పదవులు ఉండరాదన్న నిబంధన ఉందని, ఒకరికి రెండు పదవులు దక్కితే అందులో ఏదైనా ఒకటి రాజీనామా చేయాలన్న నియమం ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నికైతే జోడు పదవుల్లా చూడాల్సిన అవసరం లేదని, ఆ నియమం దీనికి వర్తించదని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్యే ఉన్నట్లయితే పార్టీకి మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి డిసిసి అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురికి పదవులు ఇవ్వడం పై మీడియా ప్రస్తావించగా, చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడే వారికి ఈ నిబంధన వర్తించదని, ఉన్నఫలంగా తెరపైకి వచ్చి పదవి కోరితే ఇవ్వడం కుదరదని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అభివృద్ధి కోసం పని చేయాలని ఆయన తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదాల గురించి ప్రశ్నించగా, అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. మంత్రి కొండా సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సమాచార లోపం కారణంగా తలెత్తిన వివాదం సమిసిపోయిందన్నారు. అక్కడక్కడా తలెత్తిన వివాదాలూ పరిష్కారమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని మహేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కులాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్టీ అన్నింటికీ సుప్రీం అని గుర్తు చేసారు. అక్కడ హైదరాబాద్‌లో ఏమి జరుగుతుందో ఢిల్లీలో అధిష్టానానికి తెలియదనుకోవడం అమాయకత్వం అవుతుందన్నారు. తామంతా అధిష్టానం రాడార్ పరిధిలోనే ఉన్నామన్న విషయాన్ని అందరూ గుర్తించుకుంటే బాగుంటుందని అన్నారు. ఎంతటి వారైనా పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. అధికారులు, మంత్రులెవరైనా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన తెలిపారు.
మెట్రో ఫేస్ టూకు కిషన్ రెడ్డి అడ్డంకి
మెట్రో ఫేస్ టూకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అడ్డంకిగా మారారని ఆయన విమర్శించారు. మెట్రో ఫేస్ టూని త్వరితగతిన పూర్తి చేయించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన చేసిందేమిటని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
చిల్లరగా మాట్లాడిన కేంద్ర మంత్రి బండి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిల్లరగా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందన్నారు.
కెసిఆర్‌ను గౌరవిస్తాం..
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఉద్యమ నేతగా గౌరవిస్తామని ఆయన తెలిపారు. కెసిఆర్ పాలన గాడి తప్పిందని, రాష్ట్రం దివాళా తీసిందని ఆయన విమర్శించారు. బనకచర్ల విషయంలో కెసిఆర్ ఉదాసీనంగా వ్యవహారించారని ఆయన విమర్శించారు. గత పదేళ్ళ పాలనలో కవిత భాగస్వామిగా ఉన్నప్పుడు అమరవీరులు ఎందుకు గుర్తు రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.