భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ముగిసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంది. అయినప్పటికీ.. ఆఖరి మ్యాచ్‌లో భారత్ సాధించిన విజయం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్‌లోకి రావడం ఆనందాన్ని కలిగించింది. ఈ మ్యాచ్‌లో రోహిట్ శతకం, విరాట్ అర్థ శతకం సాధించి.. కంగారులను కంగారు పెట్టారు. అయితే సిరీస్ ముగిసిన తర్వాత టీం ఇండియా ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు రోహిత్ శర్మనే వరించింది. కండీషనింగ్ కోచ్ ఆడ్రియన్ లె రౌక్స్ చేతుల మీదుగా రోహిత్ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘తొలి వికెట్‌కి గిల్‌తో కలిసి రోహిత్ నిర్మించిన భాగస్వామ్యం ఎంతో కీలకమైంది. ఆ తర్వాత విరాట్-రోహిత్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రోహిత్ సెంచరీ చేయడమే కాక.. ఆఖరి వరకూ మ్యాచ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. ఛేజింగ్‌లో మన సత్తా ఏంటో నిరూపించాం. ఈ మ్యాచ్‌లో మన బౌలింగ్ కూడా బాగుంది. ఆస్ట్రేలియా మొదటి 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. కానీ, సరైన సమయంలో మన బౌలర్లు వికెట్లు తీసి ఆసీస్‌ని కట్టడి చేశఆరు. హర్షిత్ రాణాను ప్రత్యేకంగా అభినందించాలి. మంచి స్పెల్ వేశాడు. ఇకపై ఇలాగే కొనసాగాలని చెబుతా’’ అని గంభీర్ అన్నారు.
ఇక రోహిత్ తన బ్యాటింగ్ గురించి బిసిసిఐ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడూ నాలుగైదు నెలలు ప్రాక్టీస్ చేయలేదు. కానీ, ఆసీస్ వన్డే సిరీస్ కోసం ఇప్పుడు చేశాను. దీనిని సరిగ్గా వినియోగించుకోవాలని భావించా. నా శైలిలోనే ఆడాలని అనుకున్నా. మిగిలిన కెరీర్ కోసం ఏం చేయగలనో అని ఆలోచించాను. దాని కోసం మనం సన్నద్ధం కావాలి. అందుకే సమయం తీసుకున్నా.. దాని ఫలితం ఈ సిరీస్‌లో కనిపించింది. గిల్ ఔట్ అయ్యాడు.. శ్రేయస్‌కి గాయమైంది. దీంతో విరాట్ నేను కలిసి వికెట్ ఇవ్వకుండా ముగించాలని భావించాం. ఆసీస్ ప్రజలకు నా కృతజ్ఞతలు. మా ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు’’ అని అన్నాడు.